
ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా అరుణ్ భీమవరపు రూపొందిస్తున్న చిత్రం ‘లవ్ మీ’. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 25న సినిమా విడుదల కానుంది. శనివారం ‘రావాలి రా.. నను చేరగా’ అనే పాటను లాంచ్ చేశారు. దిల్ రాజు మాట్లాడుతూ ‘ఐదుగురు సింగర్లతో పాటు వైష్ణవి చేత కీరవాణి గారు ఈ పాటను పాడించారు. అందరూ ఈ పాటను హమ్ చేస్తూనే ఉంటారు. కీరవాణి గారు ఎంతో మెలోడియస్‌గా ట్యూన్ చేశారు.
ఈ స్టోరీ విన్నప్పుడు ఓ కొత్త కథ విన్న ఫీలింగ్ అనిపించింది. ఎక్సయిటింగ్‌గా సినిమా కోసం ఎదురు చేస్తున్నా’ అని అన్నారు. ఆశిష్ మాట్లాడుతూ ‘ఇదొక డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ లవ్ స్టోరీ. ఇలాంటి కొత్త సినిమాలను ఆడియెన్స్ ఆదరిస్తారని ఆశిస్తున్నా’ అని చెప్పాడు. కీరవాణి గారి ట్యూన్, చంద్రబోస్ గారి లిరిక్స్‌తో ఉన్న పాటలో నటించడం ఆనందంగా ఉందని వైష్ణవి చైతన్య చెప్పింది. దర్శకుడు మాట్లాడుతూ ‘ఘోస్ట్‌ని లవ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కథ. నేను మూడు నవలలు రాశాను. ఈ కథను కూడా నవలగా రాశాను. కానీ సినిమాగా తీశాను. ఇంత వరకు చేయని, రాయని పాత్రను ఆశిష్ పోషించాడు. ఆ కారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది’ అని చెప్పాడు.