కొత్త బాస్‌ లు ఎవరు?...కొత్త సీఎస్, డీజీపీ నియామకం పై సర్కార్ కసరత్తు

కొత్త బాస్‌ లు ఎవరు?...కొత్త సీఎస్, డీజీపీ నియామకం పై సర్కార్ కసరత్తు
  •     వచ్చే నెలతో ముగియనున్న సీఎస్ పదవీ కాలం
  •     చీఫ్​ సెక్రటరీ రేసులో ముగ్గురు సీనియర్ ఐఏఎస్‌లు
  •     వికాస్ రాజ్‌, జయేశ్​ రంజన్, సవ్యసాచి ఘోష్ మధ్య పోటీ​
  •     రామకృష్ణారావు పొడిగింపుపైనా సర్కార్​ ఆలోచన
  •     రెగ్యులర్​ డీజీపీ రేసులో సీవీ ఆనంద్‌తో పాటు మరో ఇద్దరు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) పదవీకాలం వచ్చే నెలతో ముగియనుండడంతో కొత్త బాస్ ఎంపికపై రాష్ట్ర సర్కారు కసరత్తు ప్రారంభించింది. ఈ పోస్ట్​కోసం 1992 బ్యాచ్‌కు చెందిన వికాస్ రాజ్, జయేశ్ రంజన్‌తో పాటు 1994 బ్యాచ్ అధికారి సవ్యసాచి ఘోష్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.  జయేశ్ రంజన్ వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో, సవ్యసాచి ఘోష్ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో పదవీ విరమణ చేయనున్నారు. వికాస్ రాజ్ కు 2028 మార్చి వరకు సర్వీస్​ ఉండడంతో ఆయన పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. 

మరోవైపు జయేశ్ కు అడ్మినిస్ట్రేషన్‌పై మంచి పట్టుంది. చాలాకాలం పాటు  కీలకమైన ఐటీ, ఇండస్ట్రీ శాఖ నిర్వహించారు. అదే సమయంలో దావోస్, గ్లోబల్​సమిట్ లలో పెట్టుబడుల విషయంలో కీలకంగా వ్యవహరించిన జయేశ్​పై సీఎం సానుకూలంగా ఉన్నారు. కానీ, ఈయన పట్ల మిగతా మంత్రుల్లో పెద్దగా ఆసక్తి లేనట్టు తెలుస్తోంది. ఇక సవ్యసాచికి కూడా సీనియారిటీ ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో తెలంగాణ పరిస్థితులపై అవగాహన లేకపోవడం, ఇప్పటివరకు ప్రధాన శాఖలను చూడకపోవడం మైనస్‌గా మారింది. ఇక అత్యంత సీనియర్ అయిన 1990 బ్యాచ్ శశాంక్ గోయల్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో, 1991 బ్యాచ్ అరవింద్ కుమార్ అక్టోబర్‌లో రిటైర్ కానున్నారు. 

అరవింద్ కుమార్‌పై కేసులు ఉండడంతో ప్రభుత్వం ఆయనపై ఆసక్తి చూపడం లేదు. ఈ క్రమంలో ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు పనితీరు పట్ల సంతృప్తి ఉండటం, మిగిలిన ఐఏఎస్​ల నుంచి ఎలాంటి కంప్లయింట్స్​ లేకపోవడంతో ఆయన పదవీ కాలం పొడిగించే అంశాన్ని కూడా ప్రభుత్వం సీరియస్​గా పరిశీలిస్తోంది. ఇప్పటికే ఏడు నెలల పొడిగింపులో ఉన్న ఆయననే కొనసాగిస్తారా? లేదంటే ముగ్గురు సీనియర్లలో ఎవరికైనా పగ్గాలు ఇస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

డీజీపీ పోస్టు ఎవరికి దక్కేనో

మరోవైపు సుప్రీం ఆదేశాల ప్రకారం రాష్ట్రానికి రెగ్యులర్ డీజీపీని నియమించే ప్రక్రియను ప్రభుత్వం స్పీడప్​చేసింది. ఈమేరకు యూపీఎస్సీకి ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఇన్-చార్జి డీజీపీగా ఉన్న శివధర్ రెడ్డి ఈ ఏడాది ఏప్రిల్‌లో పదవీ విరమణ చేయనున్నారు. అంతకుముందే నాలుగు వారాల్లో రెగ్యులర్​ డీజీపీ నియామక ప్రక్రియను పూర్తి చేయాలని ఫిబ్రవరి మొదటి వారంలో సుప్రీంకోర్టు ఆదేశించింది. రవిగుప్తా, జితేందర్ వంటి సీనియర్లు రిటైర్ కావడంతో ఇప్పుడు డీజీపీ రేసులో 1992 బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్ పేరు ముందంజలో ఉంది. 

ఆయనతో పాటు 1994 బ్యాచ్‌కు చెందిన సౌమ్యా మిశ్రా, అభిలాషా బిష్త్ , శిఖా గోయల్​ పేర్లు కూడా తుది జాబితాలో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అభిలాషా బిస్త్​ ఏపీ క్యాడర్​ కాగా కోర్టు ఉత్తర్వులతో తెలంగాణలో కొనసాగుతున్నారు. ఇక  వినాయక్ ప్రభాకర్ అప్టే సెంట్రల్ సర్వీస్‌లో ఉన్నారు. 1995 బ్యాచ్ అధికారులకు ఇంకా డీజీ ప్రమోషన్లు ఇవ్వలేదు. 

ఒకవేళ ఈ నెలాఖరులోగా వారికి పదోన్నతులు కల్పిస్తే వారి పేర్లు కూడా రేసులోకి వచ్చే చాన్స్ ఉంది. ఇందులో మహేశ్ భగవత్, వీవీ శ్రీనివాసరావు, స్వాతి లఖ్రా ఉన్నారు.  సీవీ ఆనంద్‌కు క్షేత్రస్థాయి పోలీసింగ్‌లో ఉన్న పట్టు, ప్రభుత్వంతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారుతున్నాయి. మహిళా అధికారులైన సౌమ్యా మిశ్రా ఎంపిక చేసి రాష్ట్ర తొలి మహిళా డీజీపీగా రికార్డు సృష్టించాలని కూడా సర్కారు యోచిస్తోంది. యూపీఎస్సీ పంపే ముగ్గురి పేర్లతో కూడిన ప్యానెల్ రాగానే అందులో నుంచి ఒకరిని ప్రభుత్వం రెగ్యులర్ డీజీపీగా ఖరారు చేయనుంది.