IND vs ENG: ఉదయం 6.30 నుంచి ప్రేక్షకులకు స్టేడియంలోకి అనుమతి: రాచకొండ సీపీ

IND vs ENG: ఉదయం 6.30 నుంచి ప్రేక్షకులకు స్టేడియంలోకి అనుమతి: రాచకొండ సీపీ

గురువారం(జనవరి 25) నుంచి ఉప్పల్‌ వేదికగా భారత్‌- ఇంగ్లండ్‌ మధ్య తొలి టెస్టు ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ పోరుకు రాజీవ్‌గాంధీ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. కాకి రెట్టలు, విరిగిపోయిన పాత కుర్చీలను మార్చడంతో పాటు కొత్తగా పై కప్పులను నిర్మించారు. చూడగానే ఇది మన ఉప్పల్ స్టేడియమేనా అని ఆశ్చర్యపోయేలా కలర్‌ఫుల్‌గా మార్చేశారు. ఈ క్రమంలో భద్రతా ఏర్పాట్ల గురించి రాచకొండ సీపీ సుధీర్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు.

గురువారం ఉదయం 6.30 నుంచి ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతిస్తామని తెలిపిన రాచకొండ సీపీ.. స్టేడియం చుట్టూ ఏర్పాటుచేసిన 360 సీసీ కెమెరాలతో భద్రతను పరీక్షిస్తున్నట్లు వెల్లడించారు. పోలీస్ అధికారులపై కూడా నిఘా ఉంచుతామని తెలిపారు. ప్రేక్షకులు స్టేడియం లోపల బయట మంచిగా నడుచుకోవాలని కోరారు.

"ఉదయం 6.30 నుండి ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతిస్తాం. స్టేడియం చుట్టూ 360 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. పోలీస్ అధికారులపై కూడా నిఘా ఉంచుతాం. పీక్ అవర్స్‌లో ప్రేక్షకులు ఎక్కువ సంఖ్యలో వస్తారు కాబట్టి.. స్టేడియం చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. 1500 మంది పోలీసులతో మ్యాచ్‌కి బందోబస్తు ఏర్పాటు చేశాం. ఆక్టోపస్ బలగాలు, 100 షీ టీమ్స్ విధుల్లో ఉంటాయి. ఎట్టి పరిస్థితులలోనూ స్టేడియంలోకి కెమెరాలు, ల్యాప్‌ టాప్స్, బ్యాగ్స్, సిగరేట్స్, హెల్మెట్స్, వాటర్ బాటిల్స్, పెన్స్, పవర్ బ్యాంక్స్, బయటి ఫుడ్ అనుమతించం.."

"స్టేడియానికి వచ్చే ప్రేక్షకులు మంచిగా నడుచుకోవాలి. క్రమశిక్షణతో మెలగాలి. ఒకసారి లోపలికి వెళ్లాక బయటకి వెళ్లి తిరిగి స్టేడియం లోపలికి  వస్తామంటే అనుమతించం. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. మ్యాచ్‌కి వచ్చే వారికి సరైన పార్కింగ్ సదుపాయాలు కూడా కల్పిస్తున్నాం. బ్లాక్ టికెట్స్ అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.." అని రాచకొండ సీపీ సుధీర్ బాబు చెప్పారు. 2018 తర్వాత జరుగుతున్న టెస్టు మ్యాచ్ కావడంతో భారీ సంఖ్యలో ప్రేక్షకులు హాజరవ్వొచ్చని అంచనా. అందునా పాఠశాల విద్యార్థులకు ప్రవేశం ఉచితం కావడంతో ఎటు చూసిన వారే కనిపించొచ్చు.