మిస్టర్ టీ ఓనర్ నగర బహిష్కరణ

మిస్టర్ టీ ఓనర్ నగర బహిష్కరణ

హైదరాబాద్​సిటీ/ఇబ్రహీంపట్నం, వెలుగు: ‘మిస్టర్ టీ’ ఓనర్, రౌడీ షీటర్ నవీన్ రెడ్డిపై రాచకొండ పోలీసులు నగర బహిష్కరణ విధించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని, ఈ బహిష్కరణ ఆరు నెలల పాటు అమల్లో ఉంటుందని సీపీ సుధీర్ బాబు తెలిపారు. నల్లగొండ జిల్లాకు చెందిన కొడుదుల నవీన్ రెడ్డి (32) రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​లోని తిరుమల హోమ్స్​లో నివసించి స్థానికంగా వ్యాపారాలు చేస్తున్నాడు. ఆదిబట్ల పీఎస్​లో ఆయనపై దాడి, హత్యాయత్నం, క్రిమినల్ బెదిరింపులు, అల్లర్లు వంటి పలు కేసులు ఉన్నాయి. ఈ రికార్డులను పరిశీలించిన తర్వాత హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్, 1348 ఫస్లీ, సెక్షన్ 26(1) ప్రకారం ఇబ్రహీంపట్నం ఏసీపీ ద్వారా నోటీసులు అందజేశారు. 

ఏడు రోజుల్లోగా తనను రాచకొండ కమిషనరేట్ పరిధి నుంచి 6 నెలల పాటు ఎందుకు బహిష్కరించకూడదో కారణం తెలపాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా, నవీన్ తరచూ ప్రజలను భయపెడుతూ, బెదిరిస్తున్నాడు. అతని బెదిరింపులతో ప్రజలు సాక్ష్యాలు ఇవ్వడానికి లేదా ఫిర్యాదులు చేయడానికి కూడా భయపడుతున్నారని పోలీసులు తెలిపారు. దీంతో బహిష్కరణ తప్పనిసరియైందన్నారు. ‘మిస్టర్ టీ’ పేరుతో ఫ్రాంచైజీలు నడుపుతున్న నవీన్.. ఇన్​స్టాగ్రామ్, యూట్యూబ్​లో ఆంట్రప్రెన్యూర్, సోషల్ ఇన్‌‌‌‌ఫ్లూయెన్సర్‌‌‌‌గా చలామణి అవుతున్నాడు. మూడేండ్ల కింద ఓ మెడికల్ విద్యార్థిని కిడ్నాప్ కేసుతో నవీన్ వార్తల్లోకి ఎక్కాడు.