
-
ఈ కేసులో కేసీఆర్‌ను ప్రధాన నిందితుడిగా చేర్చాలి
-
డీజీపీకి రఘునందన్ రావు వినతి పత్రం
హైదరాబాద్, వెలుగు : ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌ను ప్రధాన నిందితుడిగా చేర్చాలని బీజేపీ నేత, మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు డిమాండ్ చేశారు. కేసీఆర్ ఆదేశాలు లేకుండా ఫోన్ ట్యాపింగ్ జరిగే ప్రసక్తే లేదన్నారు. ఈ కేసులో కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీశ్ రావు, సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకటరామిరెడ్డిని కూడా నిందితులుగా చేర్చాలని కోరారు. ఫోన్ ట్యాపింగ్‌పై 2020 నవంబర్‌లో తాను చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు నిజమయ్యాయని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బుధవారం డీజీపీ రవి గుప్తాను కలిసి, వినతి పత్రం అందించారు. ఈ కేసులో నిందితుడు ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. తన ఫోన్‌తో పాటు కుటుంబ సభ్యులవి కూడా ట్యాప్ చేశారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ పై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డీజీపీని కోరినట్లు రఘునందన్‌రావు తెలిపారు. సబితా ఇంద్రారెడ్డిపై పోటీ చేసిన వారి ఫోన్ నంబర్స్ కూడా ట్యాప్ చేశారని చెప్పారు. హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా విన్నారని తెలిసిందన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి దృష్టికి ఫోన్ ట్యాపింగ్ విషయం తీసుకెళ్లాలని డీజీపీని కోరానన్నారు. సినీ ఇండస్ట్రీతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లు ట్యప్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. హరీశ్ రావు బినామీ చానల్ ఓనర్ ఫోన్ కూడా ట్యాపింగ్ చేశాడని ఆయన తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని, లేకపోతే కోర్టులను ఆశ్రయిస్తానని చెప్పారు.