ఇంకా కల్లాలోనే రైతులు

ఇంకా కల్లాలోనే రైతులు

75 శాతం మంది  రైతులు ఇంకా కల్లాల్లోనే ఉన్నారన్నారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. సిద్దిపేట దుబ్బాక మండలం పోతరెడ్డిపేటలోని రోడ్డుపై రైతులు ధర్నాకు దిగారు. ధాన్యం కొనుగోలులో ఆలస్యం జరుగుతుందంటూ నిరసనకు దిగారు. రైతుల ధర్నాకు మద్ధతుగా రఘునందన్ రావు రోడ్డుపై బైఠాయించారు. నెల రోజులుగా కొనుగోలు విషయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. తన నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు చేయడం లేదని విమర్శించారు. వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారాయన. ప్రస్తుతం నెలకొన్న సమస్యలు సీఎం కేసీఆర్ కు, మంత్రి వర్గానికి పట్టవని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోహిణి కార్తె సమీపిస్తోందని, ఈ క్రమంలో తొందరలోనే వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ చెబుతోందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేబినెట్ సమావేశం ఏర్పాటు  చేసి జూన్ 10 కల్లా వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

తాము చేతులెత్తి పార్టీలకతీతంగా విజ్ఞప్తి చేయడం జరుగుతోందని, కాంటా విషయంలో కూడా అన్యాయం జరుగుతుందన్నారు. వెంటనే సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే రఘునందన్ కోరారు. వడ్ల కొనుగోలులో తీవ్ర జాప్యం చేస్తుండడంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రైతులు ఆందోళనకు దిగుతున్న సంగతి తెలిసిందే. వర్షానికి వడ్లు తడిసిపోతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోళ్లు పూర్తిగా బంద్ చేయడంతో ఇబ్బందులు పడుతున్నట్లు, కాంటా పెట్టిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. వడ్లను సెంటర్​కు తీసుకువచ్చి రోజులు గడుస్తున్న కాంటా వేయకుండా జాప్యం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం : -
మంత్రి మల్లారెడ్డి దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపాయే

రైతు వ్యతిరేక ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలి