కొట్లాడి పవర్‌‌ప్లాంట్‌ను ఆపా : రఘునందన్ రావు 

కొట్లాడి పవర్‌‌ప్లాంట్‌ను ఆపా : రఘునందన్ రావు 

తొగుట, దుబ్బాక, వెలుగు: మల్లనసాగర్ ప్రాజెక్టులో పవర్ ప్లాంట్ వేస్తామంటే అసెంబ్లీ లో కొట్లాడి ఆపానని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. శుక్రవారం మండలంలోని తుక్కపుర్, తొగుట గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ ను పర్యాటక కేంద్రంగా మారుస్తామని చెప్పి ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు.  తొగుట మండలాన్ని నిండా ముంచిన అప్పటి జిల్లా కలెక్టర్ ఇప్పుడు బీఆర్ఎస్ లో చేరి ఎమ్మెల్సీ అవ్వడం మన దురదృష్టమన్నారు. ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రభుత్వ అధికారులు ప్రభుత్వానికి అమ్ముడు పోతున్నారని అవేదన వ్యక్తం చేశారు. బీజేపీతోనే అన్నిరంగాల ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. 

దుబ్బాక:  మండలంలోని  పోతారంలో పేదలకు ఇవ్వాల్సిన డబుల్​ బెడ్రూమ్​లు, జాగలు, భూములున్నోళ్లకు ఇచ్చారని ఎమ్మెల్యే రఘునందన్​రావు ఆరోపించారు. శుక్రవారం పోతారం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కరోనా సమయంలో దేశాన్ని ఆదుకుంది బీజేపీ ప్రభుత్వమే అన్నారు. కుల, మతాలకతీతంగా రెండు టీకాలిచ్చి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడిందన్నారు. ప్రతీ ఒక్కరికి ఉచితంగా 6 కిలోల రేషన్​ బియ్యం పంపిణీ చేసిందన్నారు. పదేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్​ కార్డులు ఇవ్వకుండా పేదల జీవితాలతో ఆటాడుకుంటుందని విమర్శించారు. రూ.లక్ష వరకు రుణమాఫీ చేస్తానన్నా కేసీఆర్​ ప్రభుత్వం ఎవరికైనా రుణమాఫీ చేశాడా అని ప్రశ్నించారు.  రాష్ట్ర కేబినెట్​లో ఒక్క మాదిగ బిడ్డకు సీఎం కేసీఆర్​ చోటివ్వలేదని విమర్శించారు.