ర్యాగింగ్ చేసిన నలుగురు అమ్మాయిలకు ఐదేళ్ల జైలు

ర్యాగింగ్ చేసిన నలుగురు అమ్మాయిలకు ఐదేళ్ల జైలు

భోపాల్: కాలేజీలో సరదా పేరుతో ర్యాగింగ్ చేసి ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిన నలుగురు విద్యార్థినుల పట్ల జిల్లా హైకోర్టు కఠినంగా వ్యవహరించింది. ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఎనిమిదేళ్ల క్రితం అనిత అనే విద్యార్థిని ఆత్మహత్యకు బాధ్యులుగా నలుగురు విద్యార్థినులను కోర్టు దోషులుగా నిర్ధారించింది. కేసు ఎనిమిదేళ్లుగా నడవడం వల్ల శిక్షకు గురైన విద్యార్థినిలు ఇప్పటికే పెళ్లిళ్లు అయినా.. ఉద్యోగాలు చేసుకుంటున్న నేపధ్యంలో కోర్టు తీర్పు కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. భోపాల్ జిల్లాలో ఉన్న ఓ ప్రైవేటు కాలేజీలో అనిత అనే విద్యార్థిని బీఫార్మశీ కోర్సు చేరింది. కాలేజీలో చేరిన వెంటనే నలుగురు సీనియర్ అమ్మాయిలు అనితను ర్యాగింగ్ పేరుతో వేధించేవారు. ఫ్రెషర్స్ డే తర్వాత ర్యాగింగ్ ఆపేస్తారు. అయితే అనిత విషయంలో ఏడాది వరకు ర్యాగింగ్ కొనసాగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అనిత కాలేజీలో ప్రిన్సిపాల్ కు, లెక్చరర్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఇదే విషయం పలువురు సీనియర్ల దగ్గర చెప్పుకుంటే సర్దుకుపోవాలని వారు కూడా నిస్సహాయత వ్యక్తం చేయడంతో సహించలేకపోయింది. తన ఇంటికి వెళ్లి సూసైడ్ నోట్ రాసి తన ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు ఆ నలుగురు యువతులేనని స్పష్టంగా రాసింది. తాను కాలేజీలో చేరింది మొదలు ఏడాది వరకు ర్యాగింగ్ కొనసాగిస్తూనే ఉన్నారని… తన మనోవేదన గురించి ఎవరికి చెప్పుకున్నా ఫలితం లేకపోయిందని, కాలేజీ యాజమాన్యం, ప్రిన్సిపాల్, లెక్చరర్లు కూడా పట్టించుకోకపోవడం దారుణమని వాపోయింది. తనలా ఎవరూ మనోవేదనకు గురికాకూడదనే తాను ఇలా ఆత్మహత్యకు పాల్పడుతున్నానని.. తన తల్లిదండ్రులు, సోదరుడిని మిస్ అవుతున్నాను.. సారీ నన్ను క్షమించమంటూ లెటర్ రాసింది. విద్యార్థిని ఆత్మహత్య ఉదంతం అప్పట్లో సంచలనం సృష్టించింది. విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు కూడా పెద్ద ఎత్తున ర్యాగింగ్ కు వ్యతిరేకంగా నిరసనలు నిర్వహించాయి. ర్యాగింగ్ వ్యవహారం భోపాల్ లో జరిగినా.. మొత్తం దేశ వ్యాప్తంగా నిరసనలకు.. ఆందోళనలకు దారితీసింది. ఈ నేపధ్యంలో అన్ని కాలేజీల యాజమాన్యాలు తీవ్రంగా స్పందించాయి. ర్యాగింగ్ కు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు ముమ్మరం చేపట్టడంతోపాటు.. అన్ని కాలేజీల్లోనూ ర్యాగింగ్ చేయకుండా నినాదాలు కాలేజీ బోర్డుల్లో రాయించడం ప్రారంభించారు. మరో వైపు కేసు విచారణ చేపట్టిన భోపాల్ పోలీసులు  సూసైడ్ నోట్ ఆధారంగా నలుగురు విద్యార్థినులు అనితను తీవ్ర మనోవేదనకు గురిచేశారని.. చివరకు ఆత్మహత్యకు ప్రేరేపించేలా చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారణ 8 ఏళ్లు సాగింది. శనివారం భోపాల్ జిల్లా కోర్టు సంచలనాత్మక రీతిలో తీర్పు వెలువరించింది. నలుగురు యువతులు ర్యాగింగ్ కు పాల్పడడం వల్లే ఆత్మహత్యకు దారితీసిందని కోర్టు అభిప్రాయపడింది. ఇలాంటి విషయాలు క్షమించరానివని.. ఇతర కాలేజీల్లో..మరెక్కడా ఇలాంటి సంఘటనలు జరగకూడదంటే శిక్ష వేయాల్సిందేనని కోర్టు అభిప్రాయపడింది. తప్పు చేస్తే శిక్ష తప్పదని కోర్టు తన తీర్పుతో స్పష్టం చేసింది.

For More News..

ఈ బ్యాంకుల్లో అకౌంట్ ఉందా.. అయితే అప్డేట్ చేసుకోండి

108 అంబులెన్స్‌లో సరైన వైద్యం అందక.. పసికందు మృతి

వీడియో: అది యాక్సిడెంట్ కాదు.. సూసైడ్.. పరిగెత్తుకెళ్లి లారీ కిందపడిన వ్యక్తి