ఢిల్లీలోకి ప్రవేశించిన రాహుల్ జోడో యాత్ర

ఢిల్లీలోకి ప్రవేశించిన రాహుల్ జోడో యాత్ర

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఢిల్లీలోకి ప్రవేశించింది. హర్యానాలోని బదర్‌పూర్‌ సరిహద్దు నుంచి ఢిల్లీలోకి ప్రవేశించింది. ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అనిల్ చౌదరి, పార్టీ కార్యకర్తలు రాహుల్ గాంధీకి బదర్ పూర్ సరిహద్దు వద్ద ఘన స్వాగతం పలికారు. రాహుల్ వెంట హర్యానా మాజీ సీఎం భూపిందర్ సింగ్, కుమారి సెల్జా, రణదీప్ సూర్జేవాలా కూడా ఉన్నారు. ఇక ఢిల్లీలోని ఎర్రకోట వరకు రాహుల్ యాత్ర సాగనుంది. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ ప్రసంగించారు. కొంతమంది ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారని.. కానీ దేశంలోని సామాన్యులు ఇప్పుడు ప్రేమ గురించి మాట్లాడుతున్నారన్నారు. ప్రతి రాష్ట్రంలో లక్షలాది మంది యాత్రలో చేరారని చెప్పారు. మీ ద్వేషపూరిత బజార్‌లో ప్రేమ దుకాణం తెరవడానికే తాము ఇక్కడికి వచ్చామని ఆర్ఎస్ఎస్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు

ఈ ఉదయం 11 గంటలకు దేశ రాజధానిలో ఆశ్రమ చౌక్ వద్ద రాహుల్ యాత్ర ఆగనుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు మళ్లీ ప్రారంభం కానుంది. మధుర రహదారి, ఇండియా గేట్, ITO గుండా ప్రయాణించిన తర్వాత, ఎర్రకోట దగ్గర ఇవాళ్టి యాత్ర ఆగనుంది. రాహుల్ యాత్ర కారణంగా ఢిల్లీ పోలీసులు ట్రాఫిక్ ఏర్పడే అవకాశం ఉందని ప్రకటించారు. బదర్‌పూర్ నుండి ఎర్రకోట వరకు ట్రాఫిక్ భారీగా ఉండవచ్చని సూచించారు. రాహుల్ యాత్ర సమయంలో అటు వైపు ప్రయాణాలు పెట్టుకోవద్దని చెప్పారు. ఇక డిసెంబర్ 16 నాటికి రాహుల్ జోడో యాత్ర 100 రోజులు పూర్తి కానుంది. కొద్ది రోజుల విరామం తర్వాత మళ్లీ జనవరి 3న ఢిల్లీ నుండి ప్రారంభం కానుంది.