రాష్ట్రంలో ముగిసిన రాహుల్ గాంధీ పాదయాత్ర

రాష్ట్రంలో ముగిసిన రాహుల్ గాంధీ పాదయాత్ర

రాష్ట్రంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ముగిసింది. మద్నూర్ శివారులోని సలాబత్పూర్ వద్ద మహరాష్ట్రలోకి రాహుల్ యాత్ర ప్రవేశించింది. ఈ సందర్భంగా దెగ్లూరులో జాతీయ జెండాను మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడికి టీపీసీసీ చీఫ్ రేవంత్ అందజేశారు. రాహుల్ రాష్ట్రంలో 375 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ప్రతి రోజు ఉదయం 15 కిలోమీటర్ల యాత్ర సాయంత్రం 10 కిలోమీటర్ల యాత్ర సాగింది. 19 అసెంబ్లీ నియోజకవర్గాలు, 7 పార్లమెంట్ నియోజకవర్గాలలో యాత్ర కొనసాగింది.

అక్టోబర్ 23న మక్తల్ కృష్ణా నది వంతెన వద్ద రాహుల్ యాత్ర తెలంగాణలోకి ప్రవేశించింది. కన్యాకుమారి నుంచి ప్రారంభమైన ఈ యాత్ర 60 రోజులుగా  కొనసాగుతుంది. కాగా రాష్ట్రాన్ని విడిచి వెళ్తుంటే బాధగా ఉందని రాహుల్ గాంధీ  అన్నారు. రాష్ట్రంలో కార్యకర్తలు అద్భుతంగా పనిచేస్తున్నారన్న ఆయన... దెబ్బలు తాకినా, అనారోగ్యానికి గురైన పట్టుదలతో వారు పనిచేయడం భావోద్వేగానికి గురైనట్లుగా వెల్లడించారు. దీన్ని మీడియాలో చూపించినా, చూపించకపోయినా తన కళ్లతో చూశానని తెలిపారు.  రాష్ట్రంలో తనని కలిసిన ఏ ఒక్క రైతు కూడా సంతోషంగా లేడన్నారు. తెలంగాణ గళాన్ని ఒక చోట నొక్కేస్తే ఇంకో ప్రాంతం నుంచి వినిపిస్తుందని దానిని ఎవ్వరూ అణచివెయ్యలేరన్నారు. ఇక్కడ చేసిన పాదయాత్రను ఎప్పటికీ మరిచిపోనని రాహుల్ తెలిపారు.