మధ్యప్రదేశ్లో కొనసాగుతున్న రాహుల్ పాదయాత్ర

మధ్యప్రదేశ్లో కొనసాగుతున్న రాహుల్ పాదయాత్ర

సన్వర్, ఇండోర్ జిల్లా (మధ్యప్రదేశ్): కాంగ్రెస్ నేత  రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్లో కొనసాగుతోంది. మధ్యప్రదేశ్ లో ఏడో రోజుకు చేరిన ఈ యాత్రను మంగళవారం ఇండోర్ జిల్లాలోని సాన్వెర్ పట్టణం నుండి ప్రారంభించారు. సన్వెర్ పట్టణం నుండి ఉజ్జయినికి బయలుదేరిన ఈ యాత్రలో మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ సింగ్, మాజీ పార్లమెంటేరియన్ ప్రేమ్ చంద్ గుడ్డు, మాజీ మంత్రి కమలేశ్వర్ పటేల్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. 

ఉదయం 6 గంటలకు రాహుల్ పాదయాత్ర ప్రారంభించారు. పార్టీ మహిళా ప్రతినిధులు నూరీ ఖాన్, అర్చన జైస్వాల్ తదితరులు పాదయాత్రలో రాహుల్ గాంధీ వెంట నడిచారు. పలుచోట్ల ప్రజలనుద్దేశించి మాట్లాడిన రాహుల్ గాంధీ టీవీల్లో మోడీని పొగిడే కార్యక్రమాలే ఎక్కువయ్యాయని.. పేదల కష్టాలు టీవీల్లో కనిపించడంలేదని విమర్శించారు. ఎక్కడకు వెళ్లినా.. ఎటు చూసినా పేదల కష్టాలు చూస్తుంటే బాధ కలుగుతుందని రాహుల్ అన్నారు.

పాదయాత్ర నినోరా గ్రామానికి చేరుకున్న అనంతరం రాహుల్ కాసేపు విరామం తీసుకున్నారు. మధ్యాహ్నం నినోరా సమీపంలోని ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామి ఆలయాన్ని రాహుల్ గాంధీ సందర్శించనున్నారు. ఆలయానికి వెళ్లే ముందు నినోరా సమీపంలోని జైన మత ప్రదేశాన్ని సందర్శిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. సాయంత్రం ఉజ్జయినిలో జరిగే బహిరంగ సభలో రాహుల్ గాంధీ  ప్రసంగించనున్నారు.

మధ్యప్రదేశ్ లో 380 కిలోమీటర్లు

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 380 కిలోమీటర్ల దూరం కొనసాగనుంది. నవంబర్ 23న మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లాలోకి ప్రవేశించిన  రాహుల్ పాదయాత్ర రాష్ట్రంలో 12 రోజులపాటు కొనసాగనుంది. డిసెంబర్ 4న రాజస్థాన్‌లోకి ప్రవేశిస్తుంది.