
శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్.. రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపించారు. రాహుల్ తనకు ఫోన్ చేసి.. తన ఆరోగ్యంపై ఆరా తీయడంతో సంజయ్ రౌత్ ఆనందం వ్యక్తం చేశారు. కొన్ని విషయాల్లో తీవ్రమైన అభిప్రాయభేదాలు ఉన్నప్పటికీ.. రాజకీయాల్లో సహా నేతల ఆరోగ్యం పట్ల దృష్టి పెట్టడం గొప్ప విషయం అన్నారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ బిజీగా ఉన్నప్పటికీ.. ఫోన్ చేసి తన ఆరోగ్యం గురించి తెలుసుకున్నారని చెప్పారు. తన ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతున్నట్లు రాహుల్ చెప్పారని సంజయ్ రౌత్ అన్నారు. జైలులో గడిపి వచ్చిన ఓ రాజకీయ నేత బాధలను తెలుసుకుని పరామర్శించడం అభినందనీయమంటూ సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు. రాహుల్ జీ తన యాత్రలో ప్రేమాభిమానాలపైనే దృష్టి పెట్టారని.. అందుకే జోడో యాత్రకు భారీ మద్దతు లభిస్తోందని రౌత్ తెలిపారు.
అంతకుముందు.. హిందుత్వ సిద్ధాంతకర్త వినాయక్ దామోదర్ సావర్కర్‌పై రాహుల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను శివసేన పార్టీ తీవ్రంగా ఖండించింది. దీంతో ఈ పార్టీ మధ్య బంధం తెగిపోనుందని వార్తలు వచ్చాయి. వాసిం జిల్లాలో నిర్వహించిన ఓ సభలో సావర్కర్ పై రాహుల్ విమర్శలు చేశారు. బీజేపీకి, ఆర్ఎస్ఎస్కు ఆయన ఓ చిహ్నమని పేర్కొన్నారు. అండమాన్ జైల్లో 2, 3 ఏళ్ల పాటు ఉన్న సావర్కర్.. క్షమాభిక్ష కోరుతూ బ్రిటిష్ వారికి అర్జీలు పెట్టుకున్నారని అన్నారు. అయితే.. ఈ వ్యాఖ్యలను శివసేన తీవ్రంగా ఖండించింది. ఇప్పుడు రాహుల్, సంజయ్ రౌత్‌కు ఫోన్ చేయడం.. ఆయన సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.