రాహుల్ గాంధీ భావోద్వేగ ట్వీట్‌

రాహుల్ గాంధీ భావోద్వేగ ట్వీట్‌

దేశం కోసం తన తండ్రి రాజీవ్‌ గాంధీ కన్న కలను ఎప్పుడూ నెరవేర్చేందుకు ప్రయత్నిస్తానని రాహుల్ గాంధీ అన్నారు. రాజీవ్ గాంధీ 78 వ జయంతి సందర్భంగా రాహుల్ భావోద్వేగ ట్వీట్‌ చేశారు. " మీరు నా గుండెల్లో ప్రతి క్షణం ఉంటారు. దేశం కోసం మీరు కన్న కలను నెరవేర్చడానికి నేను ఎప్పుడూ ప్రయత్నిస్తాను' అని ట్వీట్ చేశారు. శనివారం ఉదయం ఢిల్లీలోని వీరభూమిలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా...  రాజీవ్ గాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు.

ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌తో సహా పలువురు రాజకీయ నాయకులు మాజీ ప్రధానికి నివాళులర్పించారు.

అతి చిన్న వ‌య‌సులోనే ప్రధానిగా బాధ్యత‌లు

1944 ఆగ‌స్టు 20న ముంబైలో రాజీవ్‌ గాంధీ జ‌న్మించారు. 1984 అక్టోబ‌రులో ఆయ‌న దేశ ప్రధానిగా ప‌ద‌వీ బాధ్యత‌లు స్వీక‌రించారు. అతి చిన్న వ‌య‌సులోనే ప్రధానిగా బాధ్యత‌లు స్వీక‌రించి రాజీవ్ గాంధీ సరికొత్త రికార్డు సృష్టించారు. 1989 డిసెంబ‌ర్ 2 వ‌ర‌కూ ప్రధానిగా ప‌ని చేశారు రాజీవ్ గాంధీ. కాగా మే 1991లో త‌మిళనా‌డులోని శ్రీపెరంబుదూర్‌లో జ‌రిగిన ఎన్నిక‌ల ర్యాలీలో లిబ‌రేష‌న్ టైగ‌ర్స్ ఆఫ్ త‌మిళ ఈలం జ‌రిపిన ఆత్మాహుతి దాడిలో రాజీవ్ గాందీ మృతి చెందారు. ఈ రోజును కాంగ్రెస్ పార్టీ స‌ద్భావ‌న దివస్‌గా పాటిస్తున్న విష‌యం తెలిసిందే.