
వరుస వివాదాలు..ఎంపీగా అనర్హత వేటు...పలు రాష్ట్రాల్లో పరువు నష్టం దావా కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కాంగ్రెస్ సీనియర్ లీడర్ రాహుల్ గాంధీకి స్వల్ప ఉపశమనం లభించింది. ఓ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి ఊరట దొరికింది.
రాహల్ గాంధీపై మహారాష్ట్రలో పరువు నష్టం కేసు నమోదైంది. ఈ కేసు విచారణలో భాగంగా రాహుల్ గాంధీ ప్రత్యక్ష హాజరు నుంచి కోర్టుకు శాశ్వత మినహాయింపు ఇచ్చింది. తన న్యాయవాది ద్వారా రాహుల్ ఈ మేరకు దరఖాస్తును దాఖలు చేశారు. దీన్ని పరిశీలించిన థానే జిల్లాలోని భివండీ ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ లక్ష్మీకాంత్ సీ వాడికర్....రాహుల్ గాంధీ శాశ్వత మినహాయింపునకు అర్హుడని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే జూన్ 3న ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను నమోదు చేస్తామని తెలిపారు.
మహాత్మ గాంధీ హత్యకు ఆర్‌ఎస్‌ఎస్సే కారణమంటూ రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే రాహుల్ గాంధీ మాటలు ఆర్‌ఎస్‌ఎస్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయంటూ 2014లో ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాజేశ్ కుంటే భివండీ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణ క్రమంలో 2018 జూన్‌లో రాహుల్ గాంధీ కోర్టుకు హాజరయ్యారు. ఆ సమమంలో తాను ఢిల్లీలో ఉంటానని...కాంగ్రెస్ కార్యక్రమాలతో పాటు తోడు ఎంపీగా వయనాడ్ నియోజకవర్గంలో పర్యటించాల్సి ఉంటుందని తనకు కోర్టుకు హాజరయ్యేందుకు మినహాయింపు ఇవ్వాలని రాహుల్ గాంధీ కోర్టును అభ్యర్థించారు. తనకు బదులుగా తన న్యాయవాదిని అనుమతించాలని కోరారు. ఈ క్రమంలోనే కోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త రాజేష్ కుంటే దాఖలు చేసిన పరువునష్టం దావాలో సాక్ష్యాధారాలను నమోదు చేయడానికి మేజిస్ట్రేట్ జూన్ 3కు వాయిదా వేశారు.
సరైన సమయానికి రావాలి...
మహారాష్ట్రలో పరువు నష్టం కేసులో తర్వాతి ఉత్తర్వులు ఇచ్చే వరకు రాహుల్ గాంధీకి కోర్టులో హాజరు నుంచి మినహాయింపు ఉంటుందని భివండీ మేజిస్ట్రేట్ కోర్టు పేర్కొంది. అయితే విచారణ తేదీల్లో రాహుల్ న్యాయవాది మాత్రం ఖచ్చితంగా ... సరైన సమయానికి హాజరు కావాలని ఆదేశించింది. న్యాయస్థానం ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలని షరతులు విధించింది.