న్యూఢిల్లీ: మతపరమైన విభేదాలను ఆయుధాలుగా చేసుకుని బీజేపీ విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. రోజుకు 24 గంటలూ హిందువులు, ముస్లింల మధ్య ద్వేషాన్ని వ్యాప్తి చేసి.. అసలు సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ‘‘హిందూ-, ముస్లిం మధ్య 24 గంటలూ ద్వేషాన్ని వ్యాప్తి చేసిన తర్వాత.. మీ డబ్బును వాళ్ల స్నేహితులకు అప్పగిస్తారు. మీ పోర్టులు, విమానాశ్రయాలు, రోడ్లు, ఇతర ఆస్తులన్నింటినీ వారికి అమ్ముతారు. వారు మీ దృష్టిని మళ్లించడానికి ప్రయత్నిస్తారు. ఇది నరేంద్ర మోడీ సర్కారు కాదు.. అంబానీ -– అదానీ ప్రభుత్వం” అని ఫైర్ అయ్యారు. ఢిల్లీలోని చరిత్రాత్మక ఎర్ర కోట వద్దకు భారత్ జోడో యాత్ర చేరుకున్న నేపథ్యంలో శనివారం అక్కడ సభలో రాహుల్ మాట్లాడారు. అంతకుముందు హర్యానా నుంచి ఢిల్లీకి యాత్ర చేరుకోగా.. బదర్‌పూర్ బార్డర్ వద్ద కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.
బడా వ్యాపారులకు వేల కోట్లు
‘‘నేను 2,800 కిలోమీటర్లు నడిచాను.. ఎక్కడా ద్వేషాన్ని, హింసను చూడలేదు. కానీ టీవీని ఆన్ చేయగానే.. హింసను చూస్తున్నాను” అని రాహుల్ అన్నారు. ‘‘మీడియా.. ఓ ఫ్రెండ్. కానీ తెరవెనుక నుంచి వచ్చిన ఆదేశాల కారణంగా.. మనం చెప్పిన వాస్తవాలను అది చూపించదు” అని ఆరోపించారు. ప్రజలను వదిలేసి.. బడా వ్యాపారవేత్తలకు వేలాది కోట్లను ఇస్తున్నారని ఆరోపించారు. తన ఇమేజ్‌ను నాశనం చేసేందుకు వేల కోట్లను బీజేపీ, ప్రధాని మోడీ ఖర్చు పెట్టారని ఆరోపించారు. కానీ తాను కేవలం నెలలోనే నిజమేంటో దేశానికి చూపించానని అన్నారు. యాత్ర సందర్భంగా తనపై ప్రేమ చూపించిన ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. రాహుల్ పాదయాత్ర నేపథ్యంలో ఢిల్లీలోని పలు ఏరియాల్లో ట్రాఫిక్ జామ్ అయింది.
కలిసి అడుగులేసిన గాంధీ కుటుంబం
కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా, ఆమె కూతురు ప్రియాంక, అల్లుడు రాబర్ట్ వాద్రా, వారి పిల్లలు కలిసి రాహుల్‌తో కలిసి నడిచారు. రాహుల్ పాదయాత్రలో సోనియా పాల్గొనడం ఇది రెండోసారి. అయితే గాంధీ కుటుంబం మొత్తం కలిసి నడవడం ఇదే తొలిసారి. కాగా, జోడో యాత్రకు రాహుల్ గాంధీ 9 రోజుల విరామం ప్రకటించారు.
రాహుల్‌తో కమల్
రాహుల్ పాదయాత్రలో మక్కల్ నీది మయ్యం ఫౌండర్, సినీ నటుడు కమల్ హాసన్ పాల్గొన్నారు. తర్వాత ఎర్రకోట వద్ద ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ‘‘మొదట్లో నా వద్దకు వచ్చిన వాళ్లు.. ‘భారత్ జోడో యాత్రలో పాల్గొనడం, రాహుల్ గాంధీతో కలిసి నడవడం పెద్ద తప్పిదం’ అని నాతో చెప్పేటోళ్లు. కానీ దేశాన్ని ఏకం చేసేందుకు సాయం చేయాలని నా అంతరాత్మ చెప్పింది” అని కమల్ హాసన్ అన్నారు. ‘‘నేను ఇండియన్‌ను కాబట్టి ఇక్కడున్నా. నాకు వేరే సిద్ధాంతాలు ఉన్నాయి. వేరే పార్టీ పెట్టుకున్నాను. కానీ దేశం విషయానికి వచ్చినప్పుడు.. అన్ని పార్టీ గీతలు చెరిగిపోతాయి. అలా గీతను చెరిపేసి ఇక్కడికి వచ్చాను” అని చెప్పారు.