యూరప్ టూర్కు రాహుల్ గాంధీ..

యూరప్ టూర్కు రాహుల్ గాంధీ..

న్యూఢిల్లీ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు వెళ్లారు. వ్యక్తిగత పనుల నిమిత్తం యూరప్కు వెళ్లిన ఆయన ఆదివారం తిరిగి రానున్నారు. రాష్ట్రపతి ఎన్నికలు, పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్న సమయంలో రాహుల్ విదేశీ పర్యటనకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. కీలక సమయాల్లో రాహుల్ ఫారిన్ టూర్ల పేరుతో విదేశాలకు వెళ్తుండటం పార్టీ పగ్గాలు చేపట్టడంపై రాహుల్ గాంధీకి ఏ మేరకు ఆసక్తి ఉందన్నది తేటతెల్లం చేస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం గోవాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీగూటికి చేరుతున్న సమయంలో రాహుల్ యూరప్ కు వెళ్లడం పార్టీ నాయకుల్ని సైతం షాక్కు గురి చేసింది.  అయితే దీనిపై కాంగ్రెస్ ఇప్పటి వరకు స్పందించలేదు.

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల అంశంపై చర్చించేందుకు పార్టీ అగ్ర నాయకత్వం గురువారం భేటీ కానుంది. అయితే ఈ సమావేశానికి రాహుల్ గైర్హాజరు కానున్నారు. 2019  లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాభవం అనంతరం రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దీంతో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు సోనియాకు అప్పగించారు. అప్పటి నుంచి అధ్యక్ష ఎన్నికలు వాయిదా పడుతూనే ఉన్నాయి. గురవారం జరగనున్న సమావేశంలో స్పష్టత వస్తుందనుకుంటున్న సమయంలో రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.