ఐదురోజుల తర్వాత బయటికొచ్చిన రాహుల్

ఐదురోజుల తర్వాత బయటికొచ్చిన రాహుల్

ఐదురోజుల తర్వాత బయటికొచ్చిన రాహుల్

శరద్​ పవార్​ ఇంటికెళ్లి చర్చలు.. కర్ణాటక సీఎం కుమారతోనూ భేటీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్​ పార్టీ చీఫ్​ పదవికి రాజీనామా విషయంలో నెలకొన్న అనిశ్చితి కారణంగా గత ఐదు రోజులుగా ఇంటికే పరిమితమైన రాహుల్​ గాంధీ గురువారం తొలిసారి బయటికొచ్చారు. నేషనలిస్టు కాంగ్రెస్​ పార్టీ(ఎన్సీపీ) నేత​ శరద్​ పవార్​ ఇంటికెళ్లి సుమారు గంటపాటు చర్చలు జరిపారు. వర్తమాన రాజకీయాలతోపాటు శుక్రవారం జరుగనున్న ప్రతిపక్షాల సమావేశంపై ఇద్దరు నేతలు చర్చించుకున్నట్లు ఎన్సీపీ వర్గాలు తెలిపాయి. మరో ఐదు నెలల్లో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అంశం కూడా చర్చల్లో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. రాజీనామా వద్దని  రాహుల్‌‌ను పవర్‌‌ వారించినట్లు తెలిసింది. అంతకుముందు  కాంగ్రెస్‌‌ చీఫ్‌‌ తన నివాసంలో కర్ణాటక సీఎం కుమారస్వామి గౌడతో భేటీ అయ్యారు.

యూపీఏ చైర్​పర్సన్​ సోనియాగాంధీ కూడా పాల్గొన్నట్లు తెలిసింది. కర్ణాటకలో కాంగ్రెస్​–జేడీఎస్​ సర్కారును కూల్చేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం  చేయడం, సంక్షోభ నివారణ కోసం ఏఐసీసీ దూతలు బెంగళూరు వెళ్లడం తదితర పరిణామాల నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. రాజీనామాపై రాహుల్​ మనసుమార్చుకోవాలని కుమారస్వామి కోరినట్లు తెలిసింది. ఇదిలాఉంటే, జూన్​ 1న జరగనున్న కాంగ్రెస్​ పార్లమెంటరీ పార్టీ సమావేశం నేపథ్యంలో సీనియర్​ నేత అహ్మద్​ పటేల్​ ఉదయం ఏఐసీసీ ఆఫీసులో మల్లికార్జున ఖర్గే, దిగ్విజన్​ సింగ్​లతో విడివిడిగా చర్చలు జరిపారు.