రాహుల్ను పది గంటలు విచారించిన ఈడీ

రాహుల్ను పది గంటలు విచారించిన ఈడీ

న్యూఢిల్లీ, వెలుగు: నేష‌‌న‌‌ల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు రెండో రోజు మంగళవారం కూడా సుదీర్ఘంగా విచారించారు. ఉద‌‌యం11.30 నుంచి మ‌‌ధ్యాహ్నం 3.30 వ‌‌ర‌‌కు మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఆయన స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. అనంత‌‌రం గంటపాటు లంచ్ బ్రేక్ ఇచ్చారు. సాయంత్రం 4.30కి తిరిగి రాహుల్ విచారణకు హాజరయ్యారు. దాదాపు రాత్రి 9 గంటల వరకూ విచారణ కొనసాగింది. మళ్లీ బుధవారం కూడా విచారణకు రమ్మని అధికారులు రాహుల్​కు నోటీసులు ఇచ్చారు. మంగళవారం ఉదయం కూడా రాహుల్ వెంట ఆయన చెల్లెలు ప్రియాంక గాంధీ ముందుగా ఏఐసీసీ హెడ్ ఆఫీసుకు వెళ్లారు. అప్పటికే అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు రాహుల్ కు సంఘీభావం తెలిపారు. కాసేపు నేతలతో ముచ్చటించిన తర్వాత ఆయన 11.05 గంటలకు ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు. ఈడీ హెడ్ క్వార్టర్స్ వరకూ ప్రియాంక కూడా రాహుల్ వెంట వెళ్లారు. ఈడీ ఆఫీసు చుట్టూ 144 సెక్షన్ విధించారు.   

రెండోరోజూ అదే సీన్ 

రాహుల్ గాంధీ ఏఐసీసీ ఆఫీసుకు వచ్చిన సందర్భంగా పార్టీ ముఖ్యనేతలను మాత్రమే లోపలికి అనుమతించిన పోలీసులు ఇతర నేతలను అడ్డుకున్నారు. దీంతో ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు పార్టీ ఎంపీలు, నేతలు వెనుదిరగాల్సి వచ్చింది. రాహుల్​పై విచారణకు నిరసనగా అక్బర్ రోడ్, మాన్ సింగ్ రోడ్ సర్కిల్ లో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగగా.. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. చివరకు ఏఐసీసీ ఆఫీసు నుంచి ఈడీ ఆఫీసుకు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించిన పార్టీ నేతలు హరీశ్ రావత్, మల్లికార్జున ఖర్గే, జైరాం రమేశ్, రణదీప్ సుర్జేవాలా, రఘుశర్మ, ఇతర నేతలను, కార్యకర్తలను పోలీస్ స్టేషన్లకు తరలించారు. రాహుల్ ఈడీ ఆఫీస్ కు చేరుకున్న తర్వాత ట్రాఫిక్‌‌ ను యథావిధిగా అనుమతించారు. కాగా, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆస్తుల విషయంలో రూ. 2 వేల కోట్ల మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు.

ప్రత్యర్థులపై 5 వేల కేసులు: కాంగ్రెస్ 

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టి వేధిస్తోందని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఈడీని కేంద్రం ఎలక్షన్ మేనేజ్​మెంట్ డిపార్ట్​మెంట్​గా వాడుకుంటోందని, ఇప్పటిదాకా ప్రత్యర్థులపై 5 వేల కేసులు పెట్టించిందని ఆరోపించింది. బీజేపీలో చేరగానే ఆయా నేతలపై కేసులను ఎత్తేస్తోందని ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నేత రణదీప్ సుర్జేవాలా విమర్శించారు.