
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో రాహుల్ గాంధీని ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) రేపు మరోసారి ప్రశ్నించనుంది. ఇప్పటికే వరుసగా మూడురోజుల పాటు రాహుల్ ను విచారించిన ఈడీ రేపు(జూన్ 17) కూడా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే విచారణను శుక్రవారానికి బదులు సోమవారానికి వాయిదా వేయాలని రాహుల్ గాంధీ ఈడీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులకు లేఖ రాశారు. సోనియా గాంధీ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. కరోనా అనంతరం అనారోగ్య సమస్యలు తలెత్తడంతో సోనియా గాంధీ ఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. రాహుల్, ప్రియాంక గాంధీ వాద్రా ప్రస్తుతం ఆమె వద్దే ఉన్నారు.