విభజన హామీలు అమలు చేయాల్సిందే : రాహుల్ గాంధీ

విభజన హామీలు అమలు చేయాల్సిందే  :  రాహుల్ గాంధీ

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ శశిథరూర్ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయని ఆయన చెప్పారు.  కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ నిజాయితీగా ఎన్నికలు నిర్వహించారని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఖర్గే, థరూర్ ఇద్దరూ అనుభవం ఉన్న నేతలేనని రాహుల్ తెలిపారు. 

ఏపీలో మూడు రాజధానులు సరైన నిర్ణయం కాదు: రాహుల్

ప్రస్తుతం ఉమ్మడి కర్నూల్ జిల్లాలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. ఏపీలోని ప్రస్తుత పరిస్థితులపైనా ఆయన స్పందించారు. ఏపీలో మూడు రాజధానుల నిర్ణయం సరైంది కాదని చెప్పారు. ఏపీకి రాజధాని అమరావతి మాత్రమేనని స్పష్టం చేశారు. ఏపీ విభజన హామీలను కేంద్రం అమలు చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు.  పోలవరం, ప్రత్యేక హోదా అనేవి విభజన హామీల్లో ప్రధానమైనవి అని ఈ సందర్భంగా గుర్తుచేశారు. 

అధ్యక్ష ఎన్నికల పై శశిథరూర్ ఆరోపణలు

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని శశిథరూర్ ఆరోపించారు. అధ్యక్ష ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని, ఉత్తర్‌ ప్రదేశ్‌లో అత్యంత తీవ్రమైన అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు. ఈ మేరకు  కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీకి లేఖ రాశారు. ఒకవైపు కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోన్న వేళ శశిథరూర్ ఈ వాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉత్తర్‌ ప్రదేశ్‌ లో అవకతవకలు చోటుచేసుకున్న విషయన్ని  మిస్త్రీ కార్యాలయం దృష్టికి తీసుకెళ్లేందుకు చాలాసార్లు ప్రయత్నించామని.. కానీ ఫలితం లేకపోవడంతో లేఖ రాసినట్టుగా థరూర్ వెల్లడించారు. ఆ రాష్ట్రంలోని ఓట్లన్నింటినీ చెల్లనివిగా పరిగణించాలని తాము డిమాండ్‌ చేస్తున్నట్లుగా థరూర్ తన లేఖలో ప్రస్తావించారు.