కాంగ్రెస్ గెలిస్తే ప్రజా తెలంగాణ .. దొరలకు, ప్రజలకు మధ్యే ఈ ఎన్నికలు: రాహుల్

కాంగ్రెస్ గెలిస్తే  ప్రజా తెలంగాణ .. దొరలకు, ప్రజలకు మధ్యే ఈ ఎన్నికలు: రాహుల్
  • బీజేపీ, బీఆర్ఎస్, మజ్లిస్ ఒక్కటే
  • అధికారంలోకి రాగానే కేసీఆర్ అవినీతి సొమ్మును వసూలు చేస్తం
  • కాళేశ్వరం అతిపెద్ద మోసం.. రూ.లక్ష కోట్ల స్కామ్
  • కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోతున్నయ్
  • కాంగ్రెస్ హయాంలో కట్టించిన ప్రాజెక్టులు చెక్కుచెదరలే
  • పేదల భూములు గుంజుకునేందుకే ధరణి అంటూ ఫైర్ 
  • పాలమూరులో ప్రజాభేరి సభ

కొల్లాపూర్ (నాగర్ కర్నూల్), వెలుగు: దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు మధ్య అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఒకవైపు సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు.. మరోవైపు తెలంగాణ ప్రజలు, నిరుద్యోగులు, మహిళలు ఉన్నారని చెప్పారు. తెలంగాణ ఉద్యమ కలను కాంగ్రెస్ సాకారం చేయబోతున్నదని, ఈ ఎన్నికల్లో ప్రజా తెలంగాణ ఏర్పాటు కానుందని ధీమా వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌‌‌‌లో మంగళవారం నిర్వహించిన పాలమూరు ప్రజాభేరి సభలో ఆయన మాట్లాడారు. ఈ సభకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రావాల్సి ఉందని, కానీ అనారోగ్య కారణాలతో ఆమె రాలేకపోయారని చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలతో తమ కుటుంబ అనుబంధం వల్ల ఢిల్లీలో సీఈసీ మీటింగ్ ఉన్నా ఇక్కడకు వచ్చినట్టు చెప్పారు. తెలంగాణలో అధికారం, మీడియా సీఎంతో ఉంటే.. ప్రజలు కాంగ్రెస్‌‌పై విశ్వాసం చూపిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరికీ భయపడరని అన్నారు.

ప్రతి కుటుంబంపై రూ.31,500 భారం

తెలంగాణ ప్రజలతో తమది రాజకీయ బంధం కాదని, కుటుంబ అనుబంధమని రాహుల్ గాంధీ చెప్పారు. నాడు ఇందిరాగాంధీకి తెలంగాణ ప్రజలు అండగా నిలబడ్డారని అన్నారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు.. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అతిపెద్ద మోసం. సీఎం కేసీఆర్ లక్ష కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు. 2040 నాటికి తెలంగాణలోని ప్రతి కుటుంబం మీద రూ.31,500 చొప్పున ఈ భారం పడుతుంది” అని చెప్పారు. కేసీఆర్ హయాంలో నిర్మించిన  కాళేశ్వరం ప్రాజెక్ట్ పిల్లర్లు కుంగిపోతున్నాయని, కాంగ్రెస్ హయాంలో కట్టించిన నాగార్జునసాగర్, శ్రీశైలం, సింగూరు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులు ఇన్నేండ్లు గడిచినా చెక్కుచెదరలేదని అన్నారు. కాంగ్రెస్ కట్టించిన ప్రాజెక్టులు, బీఆర్ఎస్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో తేడా చూడాలని కోరారు.

మేం భూములిస్తే.. బీఆర్ఎస్ గుంజుకున్నది..

దళితులు, ఆదివాసీలు, పేదలకు భూములను కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే.. ధరణి పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని గుంజుకుంటున్నదని రాహుల్ గాంధీ ఆరోపించారు. సీఎం కుటుంబం, బంధువులు, మంత్రులు, ప్రజా ప్రతినిధులకు మాత్రమే ధరణి వల్ల లాభం కలుగుతున్నదని ఆరోపించారు. తెలంగాణ ప్రజల సొత్తు కేసీఆర్ కుటుంబ సభ్యులకే చేరుతున్నదని, కీలకమైన రెవెన్యూ, రిజిస్ట్రేషన్, మైనింగ్ శాఖలు కేసీఆర్ కుటుంబం దగ్గరే ఉన్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ వస్తే రైతుబంధు రద్దు చేస్తారని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎకరానికి రూ.15 వేలు ఇచ్చి రైతులకు భరోసా కల్పించడంతోపాటు కౌలు రైతులకు కూడా వర్తింపజేస్తామని మరోసారి ప్రకటించారు. తెలంగాణ ప్రజల నుంచి సీఎం కేసీఆర్ దోచుకున్న సొమ్మును కాంగ్రెస్ అధికారంలోకి రాగానే  వసూలు చేస్తామని, ఆ సొమ్ము ప్రజలకు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.

మూడు పార్టీలూ కలిసే పని చేస్తున్నయ్

బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు కలిసి పని చేస్తున్నాయని రాహుల్ ఆరోపించారు. ‘‘రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్‌‌, మహారాష్ట్ర రాష్ట్రాల్లో బీజేపీ కోసం ఎంఐఎం పనిచేస్తున్నది. తెలంగాణలో బీఆర్ఎస్​తో తలపడుతున్న కాంగ్రెస్.. మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీతో పొరాడుతున్నది. లోక్ సభలో బీజేపీకి బీఆర్ఎస్ పూర్తి మద్దతు ఇస్తున్నది. జీఎస్టీ, రైతు చట్టాలకు కేసీఆర్ మద్దతు ఇచ్చారు. దేశంలో ప్రతిపక్ష సీఎంలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ, ఐటీ, విజిలెన్స్​దాడులు చేస్తున్నా.. తెలంగాణ సీఎం మీద మాత్రం కేసులు ఎందుకు ఉండవు?” అని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్‌‌ల లక్ష్యం కాంగ్రెస్ పార్టీని ఓడించడమేనని ఆరోపించారు. ‘‘ఇక్కడి ప్రజల పోరాటాన్ని చూసి తెలంగాణను సోనియాగాంధీ ఇచ్చారు. తెలంగాణ సమాజం ఆశించిన ఫలితాలు వారికి దక్కుతాయని ఆశించాం. కానీ తెలంగాణలో కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే ఫలితాలను అనుభవిస్తున్నది” అని మండిపడ్డారు. కర్నాటక, ఛత్తీస్ గఢ్‌‌, హిమాచల్ ప్రదేశ్​లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మొదటి కేబినెట్ మీటింగ్​లోనే ఎన్నికల హామీల అమలుపై నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. తెలంగాణ ఆరు గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉంటామన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు జూపల్లి కృష్ణారావు, కూచుకుళ్ల రాజేశ్‌‌ రెడ్డి, వంశీకృష్ణ, సరిత, చిన్నారెడ్డి, అనిరుధ్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డిలను సభా వేదిక నుంచి ప్రజలకు పరిచయం చేశారు.

అడవి పందుల్లా మేస్తున్నరు: రేవంత్ రెడ్డి

తొమ్మిదేండ్లు అధికారం చెలాయించిన కేసీఆర్​కుటుంబం, బీఆర్ఎస్​మంత్రులు, ఎమ్మెల్యేలు తెలంగాణలోని పల్లి చేన్లలో అడివి పందుల్లాగా పడి అడ్డగోలుగా మేస్తున్నరని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. ‘‘కేసీఆర్ కొడుకు, అల్లుడు, సదువు రాని ఎర్రబెల్లి మంత్రులయ్యారు. మూడోసారి కేసీఆర్ సీఎం అయితే మనకు ఏమీ మిగలదు. తన మనుమళ్లు, మనుమరాళ్లను కూడా మంత్రులను చేస్తడు” అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలు అమలు చేస్తమన్నారు. దుబ్బాక బీఆర్‌‌‌‌ఎస్ అభ్యర్థిపై దాడి నెపం కాంగ్రెస్ పై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని, తాము దాడులు చేయాలనుకుంటే కేసీఆర్ కుటుంబం బయట తిరగలేదని, వాళ్లకు అంగీలాగు కూడా మిగలవని హెచ్చరించారు.

బీఆర్ఎస్‌‌ను కృష్ణా నదిలో ముంచుదాం: భట్టి

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో దశాబ్దకాలంలో చుక్క నీరివ్వని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కృష్ణా నదిలో ముంచుదామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఇప్పటికీ కాంగ్రెస్ కట్టిన శ్రీశైలం, కల్వకుర్తి, నెట్టెంపాడు, జూరాల, బీమా, కోయిల్‌‌సాగర్ ప్రాజెక్టుల నుంచే నీళ్లిస్తున్నారని అన్నారు. జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. కేసీఆర్ అహంకారానికి, ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోటీలో కాంగ్రెస్​ను గెలిపించాలని కోరారు. ఉద్యమకారులకు కాకుండా.. కేసీఆర్‌‌‌‌కు పెగ్గులు కలిపినోళ్లకు రాజ్యసభ సీట్లు ఇచ్చారని మండిపడ్డారు. కాంగ్రెస్‌‌ నేతలు మాణిక్ రావు ఠాక్రే, సంపత్ కుమార్, వంశీచంద్ రెడ్డి, వీహెచ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మధు యాష్కీ తదితరులు పాల్గొన్నారు.

ప్రియాంకకు బదులు రాహుల్ వచ్చిన్రు

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ కొల్లాపూర్ టూర్ చివరి నిమిషంలో రద్దయింది. ఆమెకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రియాంక స్థానంలో కొల్లాపూర్ సభకు రాహుల్ గాంధీ హాజరయ్యారు. వాస్తవానికి మంగళవారం మధ్యాహ్నం దేవరకద్రలో ఇంటింటి ప్రచారం చేసి, మహిళలతో ఇంటరాక్ట్ అయ్యి, ఆ తర్వాత సాయంత్రం కొల్లాపూర్ సభలో ప్రియాంక పాల్గొనాల్సి ఉంది. తొలుత దేవరకద్ర టూర్ క్యాన్సిల్ చేస్తున్నట్టు ప్రకటించారు. నేరుగా కొల్లాపూర్ సభకే హాజరవుతారని చెప్పారు. ఆ తర్వాత కొద్దిసేపటికే కొల్లాపూర్ సభకూ ఆమె రావడం లేదని ఢిల్లీ వర్గాలు ప్రకటించాయి. ఈ సభకు రాహుల్ హాజరుకావడంతో.. ఆయన తదుపరి టూర్ షెడ్యూల్‌‌లో మార్పులు చేశారు. బుధవారం, గురువారం ఆయన నాగర్​కర్నూల్ జిల్లాలో పర్యటించాల్సి ఉండగా.. గురువారం టూర్​ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. బుధవారం కల్వకుర్తిలో జరిగే బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొంటారని ప్రకటన విడుదల చేశారు. అదే రోజు జడ్చర్లలో కార్నర్ మీటింగ్, షాద్​నగర్​లో పాదయాత్రల్లో పాల్గొంటారని పేర్కొన్నారు..