లాక్ డౌన్ ఫెయిల్.. ఇప్పుడు ప్లాన్ – బీ ఏంటి?

లాక్ డౌన్ ఫెయిల్.. ఇప్పుడు ప్లాన్ – బీ ఏంటి?
  • 21 రోజుల్లో క‌రోనాపై గెలుస్తామని మోడీ చెప్పారు
  • 2 నెల‌లు గ‌డిచినా కేసులు భారీగా పెరుగుతున్నాయి
  • లాక్ డౌన్ విఫ‌ల‌మైంది.. ఇప్పుడు ప్లాన్ ఏంటి?
  • కేంద్రాన్ని ప్ర‌శ్నించిన రాహుల్ గాంధీ

క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి కేంద్ర ప్ర‌భుత్వం అమలు చేస్తున్న స్ట్రాట‌జీ విఫ‌ల‌మైందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమ‌ర్శించారు. దేశ‌వ్యాప్తంగా కేంద్రం విధించిన లాక్ డౌన్ ఫెయిల్ అయింద‌ని, నాలుగు ద‌శ‌లుగా ఇప్ప‌టి వ‌ర‌కు అమ‌లు చే సిన లాక్ డౌన్ ద్వారా ప్ర‌ధాని మోడీ ఆశించిన ఫ‌లితాలు రాలేద‌ని అన్నారు. ట్విట్ట‌ర్ లైవ్ ద్వారా మంగ‌ళ‌వారం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. భార‌త్ లో లాక్ డౌన్ ఫెయిల్ అయింద‌ని, నేటికీ భారీగా కొత్త క‌రోనా కేసులు న‌మోదు అవుతున్నాయ‌ని అన్నారు. అయిన‌ప్ప‌టికీ ఈ స‌మ‌యంలో లాక్ డౌన్ ఆంక్ష‌ల స‌డ‌లింపు ప్ర‌క‌టించ‌డాన్ని ఆయ‌న త‌ప్పుబ‌ట్టారు. క‌రో‌నా కేసులు భారీగా పెరుగుతున్న స‌మ‌యంలో లాక్ డౌన్ స‌డ‌లించిన దేశం యావ‌త్ ప్ర‌పంచంలో భార‌త్ ఒక్క‌టేన‌ని అన్నారు. లాక్ డౌన్ ప్ర‌క‌టించే స‌మ‌యంలో 21 రోజుల్లోనే క‌రోనా వైర‌స్ పై యుద్ధం గెల‌వ‌బోతున్నామ‌ని ప్ర‌ధాని మోడీ చెప్పార‌ని, అయితే దాదాపు 60 రోజులు దాటినా క‌రోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయ‌ని అన్నారు. ప్ర‌ధాని స‌హా ఆయ‌న అడ్వైజ‌రీ స్టాఫ్ అంద‌రూ కూడా క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతాయ‌ని చెప్పార‌ని, కానీ ఇప్పుడు జ‌రుగుతున్న‌దేంట‌ని ప్ర‌శ్నించారు రాహుల్. లాక్ డౌన్ విఫ‌ల‌మైంద‌ని, మ‌రి ఇప్పుడు ప్ర‌ధాని మోడీ స్ట్రాట‌జీ ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నాన‌ని అన్నారు. ప్ర‌స్తుతం కేంద్ర ప్ర‌భుత్వం ప్లాన్ – బీతో ముందుకు రావాల్సిన అవ‌స‌రం క‌నిపిస్తోంద‌ని, అదేంటో చెప్పాల‌ని అన్నారు.

రాష్ట్రాల‌కు సాయం చేయాలి

వ‌ల‌స కూలీలు, నిరు పేద‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం ఆదుకోవాల‌ని రాహుల్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పేద‌ల‌కు నేరుగా ఆర్థిక సాయం చేస్తున్నామ‌ని చెప్పారు. కానీ కేంద్రం నుంచి కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు సాయం అందించ‌డం లేద‌ని ఆరోపించారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో కేంద్రం స‌పోర్ట్ గా నిల‌వ‌క‌పోతే రాష్ట్ర ప్ర‌భుత్వాలు ర‌న్ కావ‌డం క‌ష్ట‌మ‌ని చెప్పారు. దీనిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాల‌కు కేంద్రం సాయం చేయాల‌న్నారు.