
రాహుల్ గాంధీ వెంటనే భారత్ జోడో యాత్రను ఆపేయాలని కాంగ్రెస్ ఎంపీ, గోవా మాజీ ముఖ్యమంత్రి ఫ్రాన్సిస్కో సర్దిన్హా అన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలపై రాహుల్ గాంధీ దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. బీజేపీని ఓడించగల ఏకైక పార్టీ కాంగ్రెస్ అని ఆయన అన్నారు. " భారత్ జోడో యాత్ర కాంగ్రెస్‌కు చాలా ముఖ్యమైనది. కానీ ఇప్పుడు రాహుల్‌జీ వెంటనే యాత్రను ఆపి.. ఎన్నికలున్న హిమాచల్ ప్రదేశ్, గుజరాత్‌లకు వెళ్లి ఎన్నికల ప్రచారం చేయాలని నేను కోరుకుంటున్నాను, ”అని ఫ్రాన్సిస్కో సర్దిన్హా అన్నారు.
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి నవంబర్ 12న ఒకే దశలో ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి. గుజరాత్ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ఇంకా ప్రకటించలేదు. అయితే ఈ రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంది. ప్రచారంలో కాంగ్రెస్ వెనుకబడి ఉంది. ఈ క్రమంలో రాహుల్ పాదయాత్రను ఆపి... ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని ఫ్రాన్సిస్కో సర్దిన్హా సలహా ఇచ్చారు. కాగా సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర జమ్మూ కాశ్మీర్‌లో ముగుస్తుంది. రాహుల్ గాంధీ ఇప్పటి వరకు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నాలుగు రాష్ట్రాల్లో పర్యటించారు.