న్యూఢిల్లీ: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్‌లో అవినీతి, అధికార దుర్వినియోగం, అహంకారం పెరిగిపోయిందని మండిపడ్డారు. ప్రజల జీవితాలను బీజేపీ నాశనం చేస్తున్నదని.. అది భ్రష్ట్ జనతా పార్టీ అని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఘటనలను ప్రస్తావిస్తూ రాహుల్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
‘‘ఉత్తరాఖండ్‌లో జరిగిన అంకితా భండారి దారుణ హత్య దేశం మొత్తాన్ని షాక్‌కు గురిచేసింది. కానీ దోషి ఎవరనేది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. ఆ బీజేపీ వీఐపీని రక్షిస్తున్నదెవరు? దేశాన్ని కుదిపేసిన ఉన్నావ్ రేప్ కేసు బాధితురాలికి న్యాయం ఎప్పుడు జరుగుతుంది? కలుషిత నీళ్ల వల్ల ఇండోర్‌లో పోయిన ప్రాణాలకు బాధ్యులెవరు?” అని రాహుల్ ప్రశ్నించారు.
‘‘ఈ ప్రభుత్వానికి పేదలు, మధ్య తరగతి ప్రజల బాధలు పట్టవు. ప్రధాని మోదీ నేతృత్వంలోని డబుల్ ఇంజన్ సర్కార్ బిలియనీర్ల కోసమే నడుస్తున్నది. అభివృద్ధి పేరుతో దోపిడీకి పాల్పడుతున్నది” అని మండిపడ్డారు.
