మోడీ సర్కార్ కాదు.. అంబానీ, అదానీ సర్కార్ : రాహుల్ గాంధీ

మోడీ సర్కార్ కాదు.. అంబానీ, అదానీ సర్కార్ : రాహుల్ గాంధీ

కేంద్రంలో ఉన్నది మోడీ సర్కార్ కాదని.. అది అంబానీ,అదానీల సర్కార్ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఆ వ్యాపారవేత్తల జేబులోనే కేంద్ర ప్రభుత్వం ఉందని.. వారి కనుసన్నల్లోనే దేశ పాలన నడుస్తోందని మండిపడ్డారు. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఆయన ఈసందర్భంగా విరుచుకుపడ్డారు.  

‘‘దేశంలోని 90 శాతం మంది ప్రజలు ఏకత్వాన్ని ఇష్టపడతారు. నాకు భారత్ జోడో యాత్రలో ఇదే విషయం తెలిసింది. అతికొద్ది మంది మాత్రమే దేశ వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటిదాకా నేను దేశంలో 2800 కిలోమీటర్లు నడిచాను. ఎక్కడ కూడా ద్వేషం కానీ.. హింస కానీ కనిపించలేదు. కానీ బీజేపీకి వంతపాడే మీడియా ఛానళ్లు 24 గంటల పాటు మతపరమైన అంశాలు, విద్వేషం రెచ్చగొట్టే వార్తలనే చూపిస్తున్నారు. ఇది మీడియా విలువలకు విరుద్ధం’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. ప్రజల ఆసక్తిని మతపరమైన అంశాలపైకి మరల్చి.. సామాన్యుల జేబుకు చిల్లు పెట్టే పనిని కేంద్ర ప్రభుత్వం చేస్తోందన్నారు. ఆర్ఎస్ఎస్ విధానాల వల్ల దేశంలో భయాందోళనలు ఆవరించాయని పేర్కొన్నారు.