మళ్లీ వ్యూహం మార్చిన కాంగ్రెస్.. నియోజకవర్గాల్లోనే ఉండాలని అభ్యర్థులకు ఆదేశం

మళ్లీ వ్యూహం మార్చిన కాంగ్రెస్..  నియోజకవర్గాల్లోనే ఉండాలని అభ్యర్థులకు ఆదేశం

తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ రిజల్ట్స్ పై ఎక్కడ చూసినా, విన్నా ఇదే చర్చ. ఆదివారం (డిసెంబర్ 3న) అసెంబ్లీ ఎలక్షన్స్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ క్రమంలో పొలిటికల్ పార్టీలు చాలా అప్రమత్తంగా ఉన్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ కంటే.. కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఒక అడుగు ముందుగానే ఉంది. ఎందుకంటే గతంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల చాలా అలర్ట్ గా కనిపిస్తోంది. 

మరికొన్ని గంటల్లో తెలంగాణలో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ అధిష్ఠానం అప్రమత్తమైంది. ఢిల్లీ నుంచి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ.. తెలంగాణ నేతలతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీ పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేశారు. అభ్యర్థులు కౌంటింగ్‌ కేంద్రాలు దాటి బయటకు రావొద్దని, ఏఐసీసీ పరిశీలకులు కూడా కేటాయించిన కౌంటింగ్‌ కేంద్రాల వద్దే ఉండాలని సూచించారు. ఇబ్బందులు ఉంటే రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లాలని స్పష్టం చేశారు.

ముందుగా హైదరాబాద్‌ రావాలని కొందరు అభ్యర్థులకు చెప్పినప్పటికీ వారిని హైదరాబాద్‌ రావొద్దని పీసీసీ నేతలు తెలిపారు. శనివారం (డిసెంబర్ 2న) రాత్రి 11.30గంటలకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ హైదరాబాద్‌ చేరుకోనున్నారు. ఆదివారం (డిసెంబర్ 3న) తాజ్‌కృష్ణ హోటల్‌ నుంచి కౌంటింగ్‌ ప్రక్రియను పరిశీలించనున్నారు. ఆదివారం ఉదయం మరికొందరు ఏఐసీసీ నేతలు రాష్ట్రానికి రానున్నారు.