
కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ కేరళ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. కేరళలో తన పార్లమెంటరీ నియోజకవర్గం సహా… వరద ముంపు ప్రాంతాల్లో రాహుల్ గాంధీ ఈ సాయంత్రం పర్యటించారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను పరిశీలించారు. అక్కడి వరద ముంపు బాధితులతో మాట్లాడారు. వారికి అందుతున్న సహాయాన్ని అడిగి తెల్సుకున్నారు. కేరళ వరద బాధిత ప్రాంతాల్లో బాధిత ప్రజలకు ఇంకా ఎంతో మెరుగైన సహాయం అందించాల్సిందిగా ఆయన ట్విట్టర్ లో స్పందించారు. మరికొన్ని రోజుల పాటు కేరళలోనే ఉండబోతున్నట్టు చెప్పారు.
వయనాడ్ లోని చుంగమ్ తలప్పుళ గ్రామంలో సెయింట్ థామస్ చర్చ్ లో ఫ్లడ్ రిలీఫ్ మెటీరియల్ ను పంపిణీ చేశారు రాహుల్ గాంధీ.
మక్కియాడ్ లో హిల్ ఫేస్ స్కూల్ ఆడిటోరియంలో ఏర్పాటుచేసిన రిలీఫ్ క్యాంప్ లో శరణార్థులతో మాట్లాడారు ఎంపీ రాహుల్ గాంధీ. తమకు ఏ సాయం అందడం లేదని స్థానికులు చెప్పడంతో వారిని ఉద్దేశించి రాహుల్ మాట్లాడారు. “నేను కేరళ ముఖ్యమంత్రిని కాను. కేరళలో మా పార్టీ ప్రభుత్వం లేదు. కేంద్రంలోనూ మా ప్రభుత్వం లేదు. ఐనా కూడా.. మీకు హక్కుగా దక్కాల్సిన దానిని అందివ్వడం నా బాధ్యత” అని రాహుల్ గాంధీ చెప్పారు.