
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. ఎంపీగా రాహుల్ గాంధీ చెల్లుబాటు కారని లోక్ సభ సెక్రటరీ జనరల్ ప్రకటించారు. రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్లు జైలు శిక్ష విధించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. లోక్ సభ సెక్రటరీ జనరల్ ఈ మేరకు 2023, మార్చి 24వ తేదీ నిర్ణయం తీసుకున్నారు.
2019 కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కోలార్‌లో నిర్వహించిన ర్యాలీలో ప్రధాని మోడీని కించపర్చే విధంగా రాహుల్ గాంధీ ప్రసంగించారు. మోడీ ఇంటి పేరు ఉన్నవారందరూ దొంగలు అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీనిపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోడీ.. సూరత్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. దీనిపై విచారించిన కోర్టు... రాహుల్ గాంధీ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. తాను అలా అనలేదని రాహుల్ వివరణ ఇచ్చారు. అయితే కోర్టు మాత్రం రాహుల్ గాంధీని దోషిగా తేల్చి..రెండేళ్లు జైలు శిక్ష విధించింది. రూ.15 వేల అపరాధం కూడా విధించింది.
ప్రజాప్రాతినిధ్యం చట్టం ప్రకారం రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలుశిక్ష పడిన వ్యక్తి తీర్పు వెలువడిన తేదీ నుంచి రాజ్యంగ పదవుల్లో ఉండటానికి గానీ లేదా ఎన్నికల్లో పోటీ చేయడానికి గానీ వీల్లేదు. ఈ నేపథ్యంలోనే లోక్ సభ జనరల్ సెక్రటరీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారు.