కమ్యూనిస్టుల తరహాలోనే రాహుల్ గాంధీ పోరాటం: ఎమ్మెల్యే కూనంనేని

కమ్యూనిస్టుల తరహాలోనే రాహుల్ గాంధీ పోరాటం: ఎమ్మెల్యే కూనంనేని

నిజామాబాద్​, వెలుగు: కమ్యూనిస్టుల తరహాలోనే రాహుల్​గాంధీ పోరాటం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమైన బీజేపీ సిద్ధాంతాలకు, రాజ్యాంగాన్ని  విచ్ఛిన్నం చేసే  మత రాజకీయాలకు వ్యతిరేకంగా, కార్పొరేట్ దోపిడీ తీరును రాహుల్​సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారన్నారు. శనివారం నిజామాబాద్​లోని శ్రద్ధానంద్​గంజ్‎లో జరిగిన మార్కెట్​కమిటీ హమాలీ, దడువాయి, చాట స్వీపర్ వర్కర్​యూనియన్​ 2వ రాష్ట్ర మహాసభకు ఆయన హాజరై మాట్లాడారు. ​ 

దేశ సంపదను అదానీ, అంబానీలకు ప్రధాని మోదీ దోచిపెడుతూ, సబ్బండ వర్గాలకు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. కార్పొరేట్​సంస్థలు రక్షణగా ఆయన నిలబడుతున్నారని ధ్వజమెత్తారు. కమ్యూనిజాన్ని నిర్మూలించడం ఎవరి తరం కాదని, దేశంలోని ఏ మూలకు వెళ్లినా ఎర్ర జెండా కనబడుతుందన్నారు. కమ్యూనిస్టులు కృష్ణుడిలాంటి వారని, ఎటు వైపు వెళ్తే అటు దిక్కు బలం ఉంటుందన్నారు.

 పేద, బడుగు, బలహీనవర్గ సమస్యలు ఎర్రజెండా పోరాటాలతోనే తీరుతాయని, స్థానిక ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో ఒకే రకమైన కూలీ రేట్లు ఉండేలా, పీఎఫ్​, ఈఎస్ఐ సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. కమ్యూనిస్టుల్లా కాంగ్రెస్​కూడా కార్మిక, కర్షక పక్షపాతిగా ప్రజాపాలన సాగిస్తోందని నిజామాబాద్​ రూరల్​ఎమ్మెల్యే భూపతిరెడ్డి పేర్కొన్నారు. 

ఇల్లు  లేని ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేస్తున్నామన్నారు.  హమాలీ కార్మికలు వయస్సు 65కు పెంచాలని ప్రభుత్వాన్ని కోరతామన్నారు. మార్కెట్​ కమిటీ చైర్మన్​ ముప్ప గంగారెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై.ఓమన్న, ఉప కార్యదర్శి నర్సింహ, సహాయ కార్యదర్శి ప్రవీణ్​, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కంజర భూమయ్య, సీపీఐ జిల్లా సెక్రటరీ పి.సుధాకర్,​ బాలరాజ్ తదితరులు ఉన్నారు.