
ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ 138వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గేతో పాటు సోనియాగాంధీ, రాహల్ గాంధీ హాజరయ్యారు. ఈ ప్రోగ్రామ్ కు సైతం రాహుల్ గాంధీ వైట్ టీ షర్ట్‌లోనే హాజరయ్యారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ వైట్ టీ షర్ట్‌లోనే కనిపిస్తున్నారు. ఇప్పుడు పార్టీ ఆవిర్భావ వేడుకలకు కూడా అలాంటి టీ షర్ట్‌లోనే కనిపించడంతో కొందరు విలేకరులు అదే విషయాన్ని ఆయన వద్ద ప్రస్తావించారు.దీనిపై స్పందించిన రాహుల్... ప్రస్తుతం టీషర్ట్‌ల హవా నడుస్తోంది.. ఎప్పటి వరకు ఆ హవా ఉంటుందో, అప్పటి వరకు కొనసాగిస్తానని అన్నారు. "టీషర్ట్ హీ చల్ రహి హై ఔర్ జబ్ తక్ చల్ రహి హై చలాయింగే" అని నవ్వుతూ రాహుల్ హిందీలో సమాధానం ఇచ్చారు.
ప్రస్తుతం భారత్ జోడో యాత్రకు విరామం ఇచ్చిన రాహుల్ గాంధీ... జనవరి 3న ఉత్తరప్రదేశ్ నుంచి తిరిగి పాదయాత్ర ప్రారంభించనున్నారు. సెప్టెంబర్‌లో కన్యాకుమారిలో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర 2023 జనవరి 20న శ్రీనగర్‌లో ముగియనుంది. ఇప్పటి వరకు 3 వేల కిలోమీటర్లు నడిచిన రాహుల్ మరో 548 కిలోమీటర్లు యాత్ర కొనసాగించనున్నారు.