దేశ ప్రజల్లో రాహుల్‌‌‌‌ ధైర్యం నింపిండు

దేశ ప్రజల్లో రాహుల్‌‌‌‌ ధైర్యం నింపిండు
  • జోడో, న్యాయ్ యాత్రలతో ప్రజల కష్టాలు తెలుసుకున్నారని వెల్లడి 
  • గాంధీ భవన్‌‌‌‌లో రాహుల్‌‌‌‌ జన్మదిన వేడుకలు

హైదరాబాద్, వెలుగు: భారత్ జోడో, న్యాయ్ యాత్రలను చేపట్టి దేశ ప్రజల్లో కాంగ్రెస్‌‌‌‌ ఎంపీ రాహుల్ గాంధీ ధైర్యం నింపారని ఆ పార్టీ ఎంపీలు మల్లు రవి, అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. బుధవారం పీసీసీ ఆధ్వర్యంలో గాంధీ భవన్‌‌‌‌లో రాహుల్‌‌‌‌ బర్త్‌‌‌‌ డే వేడుకలు ఘనంగా నిర్వహించామని పేర్కొన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. కష్టాల్లో ఉన్న ప్రజల సమస్యలను తెలుసుకున్న నేత రాహుల్ అని మల్లు రవి అన్నారు. 

బీజేపీకి 400 సీట్లు వస్తాయని మోదీ అనుకున్నారు.. కానీ రాహుల్ యాత్రలతో 240 సీట్లకే పరిమితం అయ్యారన్నారు. ప్రతిపక్షం గొంతు నొక్కి, ప్రజా సమస్యలను పట్టించుకోకుండా పరిగెత్తిన గుర్రం.. ఇప్పుడు మూడు కాళ్ల గుర్రంలా మారిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌‌‌‌కు 14 ఎంపీ సీట్లు వస్తే.. సీఎం రేవంత్ రెడ్డి తిరుగులేని నాయకుడవుతాడని భావించి, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు.

 అందుకే 8 చోట్ల బీఆర్ఎస్‌‌‌‌కు డిపాజిట్లు దక్కలేదని, ఆ 8 సీట్లను బీజేపీ గెలుచుకుందన్నారు. నైతికంగా కాంగ్రెస్ 14 సీట్లను గెలిచినట్లే లెక్క అని, బీఆర్ఎస్ చచ్చిపోతూ.. రాష్ట్రంలో బీజేపీని బతికించిందన్నారు. త్వరలో రైతు రుణమాఫీ చేస్తామని, దీనిపై సీఎం రేవంత్ కసరత్తు చేస్తున్నారని చెప్పారు. ఏ క్షణమైనా ఎన్డీయే సర్కార్ కూలిపోతుందని రాహుల్ చెప్పారని, నితీశ్‌‌‌‌ కుమార్, చంద్రబాబు దయాదాక్షిణ్యాలపై మోదీ సర్కార్ నడుస్తుందన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి రావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని, రాహుల్ ప్రధాని కావడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. 

రాహుల్‌‌‌‌ వ్యక్తి కాదు.. శక్తి..

రాహుల్ గాంధీ ఒక వ్యక్తి కాదు, శక్తి అని రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. గతంలో రాహుల్‌‌‌‌కు ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా.. ఆయన ఆ పదవి తీసుకోలేదని, తన తల్లి సోనియా సైతం ఆ పదవిని తిరస్కరించారని గుర్తుచేశారు. పార్లమెంట్‌‌‌‌లో మోదీని ప్రశ్నించినందుకు ఢిల్లీలోని తన ఇంటి నుంచి రాహుల్‌‌‌‌ను బలవంతంగా ఖాళీ చేయించారని మండిపడ్డారు. అయినా రాహుల్ భయపడలేదని, తన పోరాటం ఆపలేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాహుల్ ఓ బ్రాండ్ అని, యువతకు 
ప్రాధాన్యత ఇవ్వడంలో ఆయన ముందుంటారని చెప్పారు.

దేశానికి ఫ్యూచర్ లీడర్ రాహుల్: మహేశ్ కుమార్ గౌడ్

దేశానికి ఫ్యూచర్ లీడర్ రాహుల్ గాంధీ అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. బుధవారం గాంధీ భవన్ లో జరిగిన రాహుల్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఆయన.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ప్రధానిగా రాహుల్ కు అవకాశం వచ్చినా  మన్మోహన్ సింగ్ కోసం దాన్ని త్యాగం చేశారని ప్రశంసించారు. దేశంలో లౌకికవాదం బతకాలంటే రాహుల్ ప్రధాని కావాలన్నారు.రాహుల్ వేల కిలో మీటర్లు పాదయాత్ర చేసి దేశ ప్రజల కష్ట, నష్టాలను తెలుసుకున్న నేతని చెప్పారు. పదేళ్లలో దేశానికి బీజేపీ చేసిందేమీ లేదని, దేవుడి పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. దేశాన్ని నడిపేందుకు రాహుల్ గాంధీకి దేవుడు ఆశీస్సులు ఇవ్వాలని వేడుకున్నారు.