రాహుల్ గాంధీ రోజుకో అబద్ధం చెబుతున్నారు

రాహుల్ గాంధీ రోజుకో అబద్ధం చెబుతున్నారు
  • ఆరోగ్య సేతు యాప్ పై విమర్శలకు బీజేపీ కౌంటర్

న్యూఢిల్లీ : ఆరోగ్య సేతు యాప్ జనాల ప్రైవసీ కి భంగం కలిగిస్తుందన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. రాహుల్ గాంధీ రోజుకో కొత్త అబద్ధం చెబుతున్నాడంటూ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు. జీవితాంతం ఇతరులపై నిఘా పెట్టే మీకు టెక్నాలజీని మంచిగా ఎలా వాడాలో తెలియదంటూ కామెంట్ చేశారు. ఆరోగ్య సేతు యాప్ ఆపరేషన్ ను ప్రైవేట్ సంస్థకు అప్పగించారన్న ఆరోపణలను రవిశంకర్ ప్రసాద్ ఖండించారు. ” మీరు రోజుకో కొత్త అబద్ధం చెబుతున్నారు. ఆరోగ్య సేతు యాప్ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఎంతో మేలు చేస్తుంది. అత్యంత కట్టుదిట్టమైన డేటా సెక్యూరిటీ సిస్టమ్ దీనికి ఉంది. జీవితాంతం ఇతరులను నిఘా పెట్టే వారికి టెక్నాలజీని మంచి కోసం ఎలా వాడతారో తెలియదు” అంటూ రాహుల్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ఇండియా గురించి అర్థం చేసుకోలేని వారికి రాహుల్ గాంధీ తన ట్విట్టర్ అకౌంట్ ను అవుట్ సోర్సింగ్ ఇవ్వటం అపేయాల్సిన సమయం వచ్చిందంటూ రవిశంకర్ అన్నారు. ప్రపంచం మొత్తం ఆరోగ్య సేతు యాప్ ను మెచ్చుకుంటే రాహుల్ గాంధీ మాత్రం ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.