
- దేశ ప్రజలు ప్రధాని వైపే ఉన్నారు: కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ ఇమేజీని దెబ్బతీయడానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ అన్నారు. దేశ ప్రజలు మోడీ వైపు ఉన్నంత కాలం ఆయన ఇమేజీని రాహుల్ దెబ్బతీయలేరని ఆమె పేర్కొన్నారు. మంగళవారం మీడియా సమావేశంలో స్మృతి మాట్లాడారు. ‘‘నరేంద్ర మోడీ ఇమేజీని దెబ్బతీయడమే తన లక్ష్యమని 2019లో ఓ మేగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ అన్నారు. అంతకుముందు పార్లమెంట్ లోనూ మోడీపై ఆయన ఆధారం లేని ఆరోపణలు చేశారు. మోడీని అడ్డుకోలేకపోవడంతో రాహుల్ నిరాశలోకి వెళ్లి ఏదేదో మాట్లాడుతున్నారు. అదేపనిగా మోడీపై విషం చిమ్ముతున్నారు” అని స్మృతి పేర్కొన్నారు.
మోడీపై రాహుల్‌కు ఉన్న ద్వేషం దేశంపై ద్వేషంగా మారిందని, ఇటీవలే లండన్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని ఆమె తెలిపారు. గాంధీ కుటుంబానికి మన దేశ ప్రజాస్వామ్యంతో కానీ, కోర్టులతో కానీ పనిలేదని మండిపడ్డారు. ‘‘రాహుల్ ఒకే ఒక్క టార్గెట్ ప్రధాని మోడీ. మోడీ టార్గెట్ దేశ అభివృద్ధి. దేశ ప్రజల మద్దతు మోడీకి ఉన్నంత కాలం ఆయనను రాహుల్ అడ్డుకోలేరు” అని స్మృతి అన్నారు. అలాగే పరువునష్టం దావాలో సూరత్ కోర్టు రాహుల్‌ను దోషిగా ప్రకటించడంపైనా మంత్రి స్పందించారు. ఆ కేసులో రాహుల్ దోషిగా తేలినా ఓబీసీ సామాజికవర్గానికి క్షమాపణ చెప్పడం లేదని, ఇది గాంధీ ఫ్యామిలీ రాజకీయ దురహంకారానికి నిదర్శనమని ఆమె విమర్శించారు.
ఆయన కుటుంబం ఓబీసీలను అవమానించడం ఇదే మొదటిసారి కాదని, అంతకుముందు కూడా ఓబీసీలను వారు అవమానించారని చెప్పారు. కాంగ్రెస్‌కు చెందిన ఓ దళిత నాయకుడితో చెప్పులు మోయించినపుడు గాంధీల రాజకీయ దురహంకారాన్ని దేశం చూసిందని గుర్తుచేశారు. అలాగే రాష్ట్రపతి ఎన్నిక సమయంలో ద్రౌపది ముర్ము పేరును ప్రతిపాదించినపుడు కూడా గాంధీల శిష్యరికంలోని కాంగ్రెస్ నేతలు ఆమెపై తీవ్రమైన మాటల దాడికి పాల్పడ్డారని ఆమె గుర్తుచేశారు. తన అధికారిక బంగ్లాను వచ్చే నెల 22 లోపు ఖాళీ చేయాలంటూ రాహుల్ కు నోటీసులు పంపడంపైనా ఆమె స్పందించారు. ఆ బంగ్లా రాహుల్ గాంధీది కాదని.. ప్రజలదని చెప్పారు.