మరోసారి రికార్డ్ రేట్లు పలికిన హైదరాబాద్ రాయదుర్గం భూములు.. ఎకరం రూ.237 కోట్లు !

మరోసారి రికార్డ్ రేట్లు పలికిన హైదరాబాద్ రాయదుర్గం భూములు.. ఎకరం రూ.237 కోట్లు !
  • రాయదుర్గంలో 6.29 ఎకరాలకు టీజీఐఐసీ వేలం
  • రూ.1490.73 కోట్లకు దక్కించుకున్న గౌర వెంచర్స్​ 
  • రావిర్యాలలో గజం ధర రూ.83,500

హైదరాబాద్​, వెలుగు: రాయదుర్గం భూములు మరోసారి రికార్డ్​ రేట్లు పలికాయి. స్కైరైజ్​ బిల్డింగుల మధ్య.. భూముల ధర ఆకాశాన్నంటేలా పైకి ఎగిశాయి. గత రికార్డులను బ్రేక్ ​చేస్తూ భారీ ధరలు దక్కించుకున్నాయి. హైదరాబాద్ రాయదుర్గంలోని పన్మక్త నాలెడ్జ్​ సిటీలో ఉన్న 6.29 ఎకరాల భూమికి తెలంగాణ ఇండస్ట్రియల్​ అండ్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ కార్పొరేషన్​ (టీజీఐఐసీ) గురువారం ఆన్​లైన్​లో వేలం నిర్వహించింది. ఈ ఈ–వేలంలో ఎకరా భూమి రూ.237 కోట్లు పలకడం విశేషం.

హైదరాబాద్కే చెందిన గౌర వెంచర్స్​ అనే సంస్థ ఆ మొత్తానికి వేలం పాడి దక్కించుకున్నట్టు అధికారులు తెలిపారు. సర్వే నెంబర్​ 83/1లోని 6.29 ఎకరాల్లో ఉన్న 1ఏ, 1ఎఫ్​ ప్లాట్లతో పాటు అదే సర్వే నెంబర్​లోని 5.09 ఎకరాల పీ4 ప్లాట్​కు ఈ నెల 6న టీజీఐఐసీ ఈ వేలం నోటిఫికేషన్​ను జారీ చేసింది. 

ఆయా ప్లాట్లకు కనీస ధరగా రూ.139 కోట్లుగా నిర్దేశించింది. 1ఏ, 1ఎఫ్​ ప్లాట్లకు గురువారం ఈ వేలం నిర్వహించారు. ఎకరం రూ.237 కోట్లు పలికింది. మొత్తంగా 6.29 ఎకరాలకుగానూ రూ.1490.73 కోట్ల మేర ఆదాయం టీజీఐఐసీకి రానుంది.

నిర్దేశించిన అప్​సెట్​ ప్రైస్​ కన్నా వేలంలో 70.5 శాతం అధికంగా రాయదుర్గం భూములకు ధర దక్కడం విశేషం. టీహబ్​, టీవర్క్స్​, క్వాల్​కమ్​ క్యాంపస్​ వంటి వాటికి అత్యంత సమీపంలో ఈ ల్యాండ్​ పార్సిల్​ ఉండడంతో భారీ ధర పలికిందని అధికారులు చెబుతున్నారు. 

పీ4 ప్లాట్​కు జూన్​1న వేలం నిర్వహించనున్నారు. దానికి కూడా ఇదే స్థాయిలో ధర పలకొచ్చని భావిస్తున్నారు. వేలంలో భూమిని దక్కించుకున్న సంస్థ.. ఆ ల్యాండ్​ పార్సిల్​ను మల్టీ యూజ్​ పర్పస్​లో అభివృద్ధి చేయనుంది.

కాగా, నిరుడు అక్టోబర్​లో అదే ఏరియాలో 11 ఎకరాల భూమికి వేలం వేయగా.. ఎకరం గరిష్ఠంగా రూ.177 కోట్లు పలికింది. ఇప్పటిదాకా హైదరాబాద్​ సిటీలో అత్యంత అధిక ధర అదే కాగా.. ఇప్పుడు ఆ రికార్డ్​ ధర మరుగున పడింది.

రాయదుర్గం భూములకు ఇంతటి రికార్డ్​ ధర పలకడం.. హైదరాబాద్​పై ఇన్వెస్టర్లకున్న నమ్మకానికి నిదర్శనమని టీజీఐఐసీ వైస్​ చైర్మన్​, ఎండీ కె. శశాంక అన్నారు. ఎకరం రూ.237 కోట్లు పలకడం.. రాష్ట్ర అభివృద్ధి ప్రయాణానికి కీలక మలుపు అని పేర్కొన్నారు.

నేడు నాలుగు పార్శిల్స్​ వేలం 
కేపీహెచ్​బీ కాలనీ, కుత్బుల్లాపూర్ చింతల్ ప్రాంతాల్లోని మరో నాలుగు ల్యాండ్​పార్శిల్స్​కు  శుక్రవారం  ఈ యాక్షన్​ నిర్వహించనున్నారు . కేపీహెచ్​బీ కాలనీ ఫేజ్ 1-2 లోని 5,898 చదరపు గజాలు, 2,420 చదరపు గజాల్లోని ప్లాట్ నెం 2, కుత్బుల్లాపూర్ చింతల్ లోని 10,890 చదరపు గజాలు, 3,388 చదరపు గజాల భూములను వేలం ద్వారా విక్రయించనున్నారు.

రావిర్యాలలో గజం రూ.83,500 
అటు క్యూర్ పరిధిలో హౌసింగ్ బోర్డ్ స్థలాలకు భారీ రేట్లు పలికాయి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం, ఫ్యూచర్ సిటీ ఎంట్రన్స్​లోని రావిర్యా ల లో ఉన్న హౌసింగ్ బోర్డు భూములకు గురువారం  ఈ -వేలం నిర్వహించారు. మొత్తం నాలుగు ప్లాట్ల​కు నిర్వహించిన వేలం పాటలో చదరపు గజం  రికార్డ్ స్థాయిలో రూ.83,500 కు అమ్ముడు పోయిందని హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్  వి.పి.గౌతం  పత్రిక ప్రకటన తెలిపారు.

వెయ్యి నుంచి 13,500 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న నాలుగు ప్లాట్లకు నిర్వహించిన వేలం పాట ద్వారా సుమారు రూ. 140 కోట్లఆదాయం వచ్చిందని ఆయన తెలిపారు. ఈ భూముల వేలానికి గత నెలలో హోసింగ్ బోర్డు నోటిఫికేషన్ ఇచ్చింది. సుమారు 17 సంస్థలు పోటీ పడ్డాయి.

ఇందులో 1113 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న భూమిని చదరపు గజం రూ.83,500 కు ఒక డెవలపర్ సంస్థ దక్కించుకుంది. ఇదే ప్రాంతంలోని సుమారు 6 వేల చదరపు గజాల విస్తీర్ణంలోని భూమి చదరపు గజం రూ.62,500 రేటుకు అమ్ముడు పోయింది.