రైల్వే బ్రిడ్జి టెండర్లు పూర్తయినా ముందుకు సాగని పని

రైల్వే బ్రిడ్జి టెండర్లు పూర్తయినా ముందుకు సాగని పని

ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని  రైల్వే అండర్, ఓవర్ బ్రిడ్జి నిర్మాణాలు ముందుకు సాగడం లేదు. ఈ పనులకు     అనుమతులు, టెండర్లు పూర్తయినా పనులు చేసేందుకు  అధికారులు  చొరవ తీసుకోవడం లేదు.  దీంతో ప్రయాణికులు ఎప్పటి లాగే  ఇబ్బందులు పడుతున్నారు.  

టెండర్లు అయినా పనులు అయితలే..

రైల్వే శాఖ ద్వారా అండర్   బ్రిడ్జి  పనులు ప్రారంభం కాగా  ఆరు నెలల క్రితం రూ. 30 కోట్లతో ఆర్అండ్​బీ  ఆధ్వర్యంలో ఓవర్ బ్రిడ్జి  టెండర్ ప్రక్రియ  కూడా అయిపోయింది. అయినా  పనుల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. రెండు రైల్వే బ్రిడ్జిల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో రూ. 97 కోట్లతో పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ. 57.71 కోట్లు, కేంద్ర వాటా రూ. 39.49 కోట్లు. అయితే మొదట  ఆర్అండ్​బీ  ఆధ్వర్యంలో  చేపట్టే కోట్ల పనులకు గాను టెండర్లు పిలిచారు. ముందుగా రూ. 27 కోట్లతో టెండర్లు పిలువగా కాంట్రాక్టర్లు   ఎవరూ ముందుకు రాలేదు. గతేడాది మార్చి నుంచి మే వరకు నాలుగు సార్లు టెండర్లకు దరఖాస్తులు ఆహ్వానించినా  ఎలాంటి స్పందనా రాలేదు.  ఐదోసారి రూ. 30 కోట్లకు అంచనాలు పెంచడంతో హైదరాబాద్ కు చెందిన ఓ కంపెనీ టెండర్లను దక్కించుకుంది. 

పనుల ప్రారంభమెప్పుడో..

స్పిన్నింగ్ మిల్లు ప్రాంతంలో ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల విషయంలో ఆర్​అండ్​బీ జాప్యం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సర్వే పనులు పూర్తయినప్పటికీ స్థల సేకరణ ప్రక్రియ ముందుకు పడటం లేదు. ఏడాది నుంచి టెండర్ల ప్రక్రియనే అవగా.. ఇప్పుడు పనులు ప్రారంభించేందుకు కూడా ఆలస్యం అవుతోంది.  దీంతో  ఈ నిర్మాణాలు  పూర్తవుతాయా లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.   బ్రిడ్జి నిర్మాణం ,   బీటీ రోడ్డు నిర్మాణం, డ్రైనేజీల  నిర్మాణానికి అవసరమైన  స్థలాన్ని సేకరించాల్సి ఉంది. దీనిపై  స్థానికుల నుంచి అభ్యంతరాలు కూడా వచ్చే అవకాశం ఉంది.

ట్రాఫిక్ కష్టాలు..

రైల్వే ఓవర్, అండర్ బ్రిడ్జిల నిర్మాణం ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధికే కాకుండా ప్రజలకు ఎంతో అవసరమైనది. తాంసి బస్టాండ్ వద్ద ఉన్న రైలు పట్టాలు అవతలివైపు దాదాపు ఏడు కాలనీలు ఉంటాయి. ఇక్కడి ప్రజలందరు తాంసి బస్టాండ్ వద్ద రైలు పట్టాలు దాటి పట్టణంలోపల మార్కెట్కు రావాల్సి ఉంటుంది. మరోపక్క తాంసి, తలమడుగు మండలాలకు వెళ్లే గ్రామాల ప్రజలు సైతం తాంసి బస్టాండ్ మీదుగానే రాకపోకలు సాగిస్తారు. అటు నిత్యం ఇండస్ట్రియల్ ఏరియాకు వెళ్లే కార్మికులు.. ఇలా ఉదయం, సాయంత్రం తాంసి బస్టాండ్ ప్రాంత పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఉంటుంది. ఇక రైలు వచ్చే సమయాల్లో గేట్లు వేయడంతో పట్టాలకు ఇరువైపుల వాహనాలు కిలోమీటర్ మేర నిలిచిపోతాయి. బస్సులు, ఆటోలు, బైక్లు, కార్లు.. కాలినడకన వెళ్లేవారు.. ఇలా రైలుపట్టాలు దాటేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఇక పత్తి మార్కెట్కు వచ్చే సమయంలో రైతుల పత్తి బండ్లు ఒక వైపు.. నిత్యం ఉండే ట్రాఫిక్ మరో వైపుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

పది రోజుల్లో పనులు ప్రారంభిస్తాం..

రైల్వే ఓవర్ బ్రిడ్జీలకు సంబంధించి పనులను మరో పదిరోజుల్లో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం. టెండర్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తైంది. ప్రస్తుతం స్థల సేకరణ పనులను చేయాల్సి ఉంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా గడువులోగా పనులను పూర్తి చేస్తాం. - సురేశ్​, డీఈ, ఆర్అండ్​బీ