మేడారం హుండీ లెక్కింపు.. ఫస్ట్ డే రూ.2 కోట్ల 49 లక్షలు

మేడారం హుండీ లెక్కింపు..  ఫస్ట్ డే రూ.2 కోట్ల 49 లక్షలు
  • హుండీల్లో నోట్ల కట్టలు, చిల్లర నాణేల కుప్పలు
  •      బంగారు, వెండి అభరణాలు.. డాలర్‍ నోట్ల కానుకలు 
  •      లెక్కింపులో కౌంటింగ్‍ మెషీన్ల వినియోగం
  •     హనుమకొండ టీటీడీ కల్యాణ మండపంలో లెక్కింపు
  •     కౌంటింగ్​లో 500 మంది సిబ్బంది, వలంటీర్లు

వరంగల్, వెలుగు: తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క–సారక్క జాతర హుండీల లెక్కింపు షురూ అయింది. హనుమకొండ పబ్లిక్​ గార్డెన్​ ఎదురుగా ఉన్న టీటీడీ కల్యాణ మండపంలో హుండీల లెక్కింపునకు ఏర్పాట్లు చేయగా, గురువారం లెక్కింపు ప్రక్రియను దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. మొదటి రోజు 125 హుండీలను తెరవగా రూ.2 కోట్ల 49 లక్షల 65 వేల ఆదాయం లభించింది. ఈ మొత్తాన్ని ఎండోమెంట్ ఖాతాలో జమ చేశారు. కాగా, 2024 జాతరలో మొదటి రోజు రూ.3 కోట్ల 15 లక్షల40 వేల ఆదాయం వచ్చింది.

828 హుండీలు ఏర్పాటు..

ఈసారి భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు మొత్తం 828 హుండీలు ఏర్పాటు చేశారు. వీటిలో సమ్మక్క–సారక్క గద్దెల వద్ద 309, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల వద్ద 81 చొప్పున ఉన్నాయి. ఐరన్ హుండీలు 780, క్లాత్ హుండీలు 45, ఒడి బియ్యం హుండీలు మూడు ఏర్పాటు చేశారు. తిరుగువారం కోసం పెట్టిన 40 హుండీలు ఇంకా చేరాల్సి ఉంది. 

బంగారం, వెండి, విదేశీ కరెన్సీ..

భక్తులు బంగారం, వెండితో చేసిన అభరణాలు, నాగుపాము, ఊయల వంటి వస్తువులను మొక్కులుగా సమర్పించారు. అమెరికా డాలర్లు, సౌది రియాల్, యూకే పౌండ్ వంటి విదేశీ కరెన్సీ నోట్లను కూడా హుండీల్లో వేశారు. కొందరు పాత రూ.500, రూ.వెయ్యి నోట్లను సైతం సమర్పించారు.

కఠిన భద్రత ఏర్పాట్లు..

కానుకల లెక్కింపుకు 500 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. ఇందులో ఎండోమెంట్ శాఖ సిబ్బంది, వలంటీర్లు ఉన్నారు. లెక్కింపు కేంద్రంలో 23 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మగవారికి లుంగీ, బనియన్‍ డ్రెస్‍ కోడ్‍ పెట్టారు. పోలీస్‍ సిబ్బంది తనిఖీలు చేశాకే సిబ్బందిని కౌంటింగ్‍ హాల్​ లోపలకు అనుమతించారు. మెటల్ డిటెక్టర్లతో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

బ్యాంకు సిబ్బంది సహకారంతో..

నోట్లను వేగంగా లెక్కించేందుకు యూనియన్, హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ, కెనరా బ్యాంకుల సిబ్బంది సహకారం తీసుకున్నారు. మనీ కౌంటింగ్ మెషీన్లతో లెక్కింపు చేస్తున్నారు. చిల్లర నాణేలకు ప్రత్యేక యంత్రాలు ఏర్పాటు చేశారు. ఈసారి లెక్కింపునకు దాదాపు పది రోజులు పట్టే అవకాశం ఉందని 
అధికారులు తెలిపారు.


తల్లీ.. మా ప్రేమ పెళ్లికి పెద్దలను ఒప్పించు!

జాతర హుండీల్లో భక్తుల కోరికల లేఖలు ఆసక్తికరంగా మారాయి. ‘మా ప్రేమపెళ్లికి పెద్దలు ఒప్పుకోవాలి’ అని ఒకరు, ‘భూ వివాదం తీరాలి.. రూ.70 లక్షల భూమి రావాలి’ అని మరొకరు లెటర్​ రాసి హుండీల్లో వేశారు. కోరికలు నెరవేరితే వచ్చే జాతరలో నిలువెత్తు బంగారం, కోడి, మేకతో మొక్కు చెల్లిస్తామని పేర్కొన్నారు. సీఎం రేవంత్​రెడ్డి తమను రెగ్యులరైజ్​ చేసేలా ఆశీర్వదించాలంటూ నేషనల్​ హెల్త్​ మిషన్​ ఉద్యోగుల పేరుతో మొక్కుకున్నారు. ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌ఎం ఉద్యోగుల రెగ్యులరైజేషన్ మరికొందరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, విదేశాల్లో ఉద్యోగం వంటి కోరికలు కోరుతూ లేఖలు రాశారు. ఇలా భక్తులు తమ ఆకాంక్షలను హుండీల్లో లేఖల రూపంలో సమర్పించారు.