మేడారంలో గ్యాంగ్ రేప్ జరగలేదు.. అది ఓ యూట్యూబ్ చానెల్ పుకారు

మేడారంలో  గ్యాంగ్ రేప్ జరగలేదు..   అది ఓ యూట్యూబ్  చానెల్  పుకారు
  •     నిర్ధారించిన జాతీయ మహిళా కమిషన్  ఎంక్వయిరీ సభ్యులు
  •     మేడారంలో జిల్లా కలెక్టర్, ఎస్పీతో విచారణ బృందం భేటీ

ములుగు/తాడ్వాయి, వెలుగు: మేడారంలో బాలికపై గ్యాంగ్ రేప్​ వైరల్ న్యూస్ కు తెరపడింది. ఓ యూట్యూబ్​ చానెల్ లో వైరల్ అయిన ఈ న్యూస్​ను  సుమోటోగా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్​ (ఎన్ సీడబ్ల్యూ) చైర్​పర్సన్​ విజయ రహత్కర్​ ఎంక్వైరీ కమిషన్​ వేశారు. ఎంక్వైరీ కమిషన్  సభ్యులు గురువారం ములుగు జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు తెలుసుకున్నారు. గ్యాంగ్ రేప్  జరగలేదని, అది ఫేక్​ న్యూస్​గా తేల్చారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరలో ఈనెల 29న జంపన్నవాగు పరిసరాల్లోని ఓ మామిడి తోటలో 13 ఏళ్ల బాలికపై ఐదుగురు యువకులు గ్యాంగ్​ రేప్​ చేశారంటూ సోషల్​ మీడియాలో వార్త వైరల్ అయ్యింది. ఈ విషయంపై జిల్లా ఎస్పీ డాక్టర్​ సుధీర్​ రాంనాథ్​ కేకన్​ స్పందించారు. విచారణ జరిపి అది ఫేక్ న్యూస్​గా నిర్ధారించారు. వైరల్  చేయవద్దని ప్రకటించారు. అయితే జాతీయ మహిళా కమిషన్  ఈ విషయాన్ని సుమోటోగా తీసుకొని ఎంక్వైరీ కమిటీ వేసింది. మహిళా కమిషన్  సభ్యులు డెలినా ఖోంగ్​డప్, కాంచన్  ఖట్టర్​ ఢిల్లీ నుంచి ములుగుకు వచ్చారు. జిల్లా కలెక్టర్​ దివాకర్  టీఎస్, ఎస్పీ సుధీర్​ రాంనాథ్ కేకన్​తో సమావేశమై ఆరా తీశారు. 

కమిషన్​కు రిపోర్టు అందజేయనున్న సభ్యులు

ములుగు కలెక్టరేట్​లో పలు అంశాలపై చర్చించిన అనంతరం ఎన్​సీడబ్ల్యూ ఎంక్వైరీ కమిటీ సభ్యులు తాడ్వాయి మండలంలోని మేడారం వెళ్లారు. గ్యాంగ్ రేప్​ జరిగినట్లు ప్రచారం జరిగిన ప్రాంతాల్లో ఆర్డీఓ వెంకటేశ్  సారథ్యంలో సభ్యులు పర్యటించారు. స్థానికులను సైతం విచారించారు. అదేవిధంగా పస్రా సీఐ దయాకర్, ఎస్సై కమలాకర్​ విచారణ కమిటీ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. గ్యాంగ్​రేప్​ అంటూ వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని నిర్ధారణకు వచ్చిన కమిటీ సభ్యులు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఓ యూట్యూబ్​ చానెల్​లో వచ్చిన న్యూస్​తో ఎంక్వైరీకి వచ్చామని, క్షేత్రస్థాయిలో పరిశీలన చేశాక గ్యాంగ్ రేప్  జరగలేదని నిర్ధారణకు వచ్చామని కమిటీ సభ్యురాలు డెలినా ఖోంగ్​డప్​ వెల్లడించారు. ట్యూబ్​ చానెల్  సైతం వీడియో డిలీట్​ చేసి క్షమాపణ చెప్పిందని తెలిపారు. కాగా.. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారని, అనంతరం లిఖితపూర్వక రిపోర్టును జాతీయ మహిళా కమిషన్​కు నివేదిస్తామన్నారు.