- రేపు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ రోడ్ షో
- తర్వాత కేంద్రమంతి కిషన్ రెడ్డి వచ్చే చాన్స్
- మేయర్ అభ్యర్థిగా గాజుల ముఖేశ్ గౌడ్ ప్రకటన
మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్పై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఈ ఎన్నికల్లో మేయర్ పీఠం టార్గెట్గా పావులు కదుపుతోంది. బల్దియాపై కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆ పార్టీకి చెందిన ప్రముఖ నేతలను ప్రచార రంగంలోకి దించుతోంది. ఇందులో భాగంగా ఈ నెల 7న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మంచిర్యాలకు రానున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో భారీ రోడ్ షో నిర్వహించనున్నారు. వీవీఐపీ రాక నేపథ్యంలో బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డిని రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఆయన షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. మరోవైపు బీజేపీ మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జిగా ఆ పార్టీ నేషనల్ కౌన్సిల్ మెంబర్ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కొద్దిరోజులుగా మంచిర్యాలలోనే మకాం వేసి క్యాడర్‌కు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీ టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య ప్రచారంలో పాల్గొన్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సైతం మంచిర్యాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించి కాంగ్రెస్, బీఆర్ఎస్ తీరును ఎండగట్టారు. ఇప్పుడు ఏకంగా మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ రానుండడంతో పార్టీ క్యాడర్ జోష్‌లో మునిగింది.
చేరికలతో ఉత్సాహం
గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీలో ఉత్సాహం నింపాయి. పార్టీ అభ్యర్థి వెరబెల్లి రఘునాథ్ రావు దాదాపు 40 వేల ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలవడం తెలిసిందే. అర్బన్ ఏరియాలో రోజురోజుకు బలపడేందుకు బీజేపీ నాయకులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
పార్టీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ రఘునాథ్‌రావు ఆధ్వర్యంలో కొంతకాలంగా చేరికలపై ఫోకస్ పెట్టారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో సరైన ప్రాధాన్యం దక్కని చోటామోటా లీడర్లు ప్రత్యామ్నాయంగా బీజేపీలో చేరుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఆ రెండు పార్టీల నుంచి టికెట్ వచ్చే చాన్స్ లేని పలువురు నాయకులు ఇదే అదునుగా కాషాయ పార్టీలోకి జంప్ అవుతున్నారు.
ఇటీవల చాలామంది ఇలా చేరి అలా టికెట్లు దక్కించుకున్నారు. కొంతకాలం క్రితం వరకు అభ్యర్థులను దేవులాడుకునే పరిస్థితి నుంచి టికెట్ల కోసం పోటీ పడే స్థాయికి రావడం బీజేపీ నేతల్లో నూతనోత్సాహాన్ని నింపింది. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లకు అభ్యర్థులను ప్రకటించినప్పటికీ ప్రస్తుతం 58 మంది బరిలో ఉన్నారు. ఒక డివిజన్ అభ్యర్థి క్యాస్ట్ సర్టిఫికెట్ సమర్పించకపోవడంతో నామినేషన్ రిజెక్ట్ అయ్యింది. మరో డివిజన్ క్యాండిడేట్ ఈ నెల 3న నామినేషన్ విత్ డ్రా చేసుకొని పోటీ నుంచి తప్పుకున్నారు.
లోపాయికారీ ఒప్పందం కలిసివచ్చేనా?
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ స్పీడ్‌కు బ్రేకులు వేయడమే లక్ష్యంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీజేపీ వీక్ ఉన్న డివిజన్లలో బీఆర్ఎస్కు, బీఆర్ఎస్ బలహీనంగా ఉన్న చోట బీజేపీకి సహకరించుకునేలా రెండు పార్టీలు అవగాహనకు వచ్చినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అంతేకాకుండా ట్రయాంగిల్ ఫైట్‌లో ఏ పార్టీకీ మెజారిటీ సీట్లు రాకపోతే మేయర్ ఎన్నికల్లో ఒకరికొకరు మద్దతు తెలిపే అవకాశాలు లేకపోలేదని పేర్కొంటున్నారు. కొంతకాలంగా మంచిర్యాలలో భూదందాలు, దాడుల సంస్కృతి పెరిగింది. దీంతో ఈ ఎన్నికల్లో ఎలాగైనా కాంగ్రెస్‌ను దెబ్బకొట్టాలని రెండు పార్టీలు లోపాయికారీ ఒప్పందానికి వచ్చినట్టు తెలుస్తోంది.
మేయర్ అభ్యర్థిగా గాజుల ముఖేశ్ గౌడ్
మంచిర్యాల మేయర్ సీటు బీసీ జనరల్‌కు రిజర్వ్ అయ్యింది. దీంతో బీజేపీ వ్యూహాత్మకంగా ఇతర పార్టీల కంటే ముందుగానే మేయర్ అభ్యర్థిని ప్రకటించింది. మేయర్ అభ్యర్థిగా మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గాజుల ముఖేశ్ గౌడ్ పేరును ఆ పార్టీ ఎన్నికల ఇన్చార్జి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గురువారం మీడియా సమావేశంలో ప్రకటించారు. ఈ ఎన్నికల్లో మెజారిటీ డివిజన్లలో బీజేపీని గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కార్పొరేషన్లో గెలిస్తే అసెంబ్లీకి..
ఈసారి మంచిర్యాల కార్పొరేషన్లో గెలిస్తే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కలిసివస్తుందని బీజేపీ భావిస్తోంది. ఎందుకంటే గతంలో ఉన్న మంచిర్యాల మున్సిపాలిటీని నిరుడు కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేశారు. పక్కనున్న నస్పూర్ మున్సిపాలిటీతో పాటు హాజీపూర్ మండలంలోని ఐదు గ్రామ పంచాయతీలను ఇందులో విలీనం చేశారు. దీంతో కార్పొరేషన్ పరిధి విస్తరించడమే కాకుండా ఓటర్ల సంఖ్య 1.81 లక్షలకు చేరింది.
నియోజకవర్గంలోని మొత్తం ఓటర్లలో మూడొంతుల మంది కార్పొరేషన్ పరిధిలోకి వచ్చారు. దీంతో కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఈజీ అవుతుంది. ఈ కారణంగా మూడు ప్రధాన పార్టీలు కార్పొరేషన్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఫైట్ చేస్తున్నాయి.
