కొమురవెల్లిలో రైల్వే హాల్ట్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన

కొమురవెల్లిలో రైల్వే హాల్ట్ స్టేషన్  నిర్మాణ పనులకు శంకుస్థాపన

సిద్దిపేట, వెలుగు :  కొమురవెల్లి మల్లన్న భక్తుల చిరకాల స్వప్నం నెరవేరబోతోంది. హైదరాబాద్​సహా దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ఇక్కడ రైల్వేస్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు. మనోహరాబాద్– కొత్తపల్లి రైల్వే లైన్​లో భాగంగా నేషనల్​హైవే కొండపాక గేట్ నుంచి రెండు కిలో మీటర్ల దూరంలోని  రైల్వే అండర్ పాస్ సమీపంలో దుద్దెడ, లకుడారం స్టేషన్ల మధ్య కొత్తగా కొమురవెల్లి హాల్ట్ స్టేషన్ నిర్మించాలని నిర్ణయించారు. నిర్మాణ పనులకు గురువారం శంకుస్థాపన చేయనున్నారు.

ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మధ్యప్రదేశ్​సీఎం మోహన్ యాదవ్, రాష్ట్ర మంత్రులు కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్, జడ్పీ చైర్ పర్సన్ రోజాశర్మ, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, జీవన్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ హాజరుకానున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు శంకుస్థాపన చేసి, అనంతరం ఏర్పాటు చేసే సభలో ప్రసంగించనున్నారు. ఏటా తెలుగు రాష్ట్రాలతోపాటు ఛత్తీస్​గఢ్, మహారాష్ట్ర నుంచి కొమురవెల్లికి దాదాపు 25 లక్షల మంది భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా మూడు నెలలపాటు జరిగే జాతర రోజుల్లో 10 లక్షలకు పైగా వస్తారు. వీరందరికి కొత్తస్టేషన్​తో దూరాభారం తగ్గనుంది. 

సకల సౌకర్యాలతో..

కొమురవెల్లికి మూడు కిలో మీటర్ల దూరంలో ఏర్పాటవుతున్న హాల్ట్ స్టేషన్ లో సకల సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నారు. దాదాపు అర ఎకరం స్థలంలో 400  మీటర్ల పొడవు ఫ్లాట్ ఫామ్​నిర్మించనున్నారు. ప్రస్తుతం కొండపాక వైపు మాత్రమే ప్లాన్​చేశారు. భవిష్యత్తులో మరో రైల్వే ట్రాక్ నిర్మించేలా రెడీ చేస్తున్నారు. స్టేషన్ బిల్డింగ్, వెటింగ్ హాల్, షెల్టర్ సీటింగ్, టికెట్ కౌంటర్లతోపాటు ప్రయాణికులకు అవసరమైన ప్రాథమిక సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు.

మనోహరాబాద్-– కొత్తపల్లి రైల్వే లైన్​లో భాగంగా కొమురవెల్లిలో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ స్థానికులు, భక్తులు ఇప్పటివరకు ప్రభుత్వాలకు ఎన్నోసార్లు వినతిపత్రాలు ఇచ్చారు. అయితే సాంకేతిక కారణాలతో ఏర్పాటు చేయలేదు. కొమురవెల్లికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న లకుడారంలో స్టేషన్​ఏర్పాటు చేశారు. అక్కడికి రాకపోకలు సరిగా లేకపోవడంతో కనీసం హాల్ట్ స్టేషన్ అయినా ఏర్పాటు చేయాలని కోరారు. గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందజేస్తూ వచ్చారు. చివరికి హాల్ట్ స్టేషన్ ఏర్పాటుకు రైల్వే శాఖ ఓకే చెప్పింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే శంకుస్థాపన చేసి, తర్వాత పూర్తి స్థాయిలో ఎస్టిమేట్లు రెడీ చేయాలని నిర్ణయించింది.