త్వరగా భూమి సేకరించి ఇస్తే ట్రిపుల్​ ఆర్​ చుట్టూ రైల్వే లైన్​

త్వరగా భూమి సేకరించి ఇస్తే ట్రిపుల్​ ఆర్​ చుట్టూ రైల్వే లైన్​

సిద్దిపేట, వెలుగు: రాష్ట్రంలో రైల్వే లైన్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యతనిస్తోందని, దీని కోసం తొమ్మిదేండ్లలో రూ.30 వేల కోట్లు ఖర్చు చేసిందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా కొమురవెల్లి వద్ద రైల్వే హాల్ట్ స్టేషన్ నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి తర్వాత ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో 40  రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు ప్రధాని మోదీ అమోదం తెలిపారని, రూ.750 కోట్లతో సికింద్రాబాద్, రూ.350 కోట్లతో నాంపల్లి, రూ.450 కోట్లతో  కాచిగూడ రైల్వే స్టేషన్లను ఆధునీకరించడంతో పాటు కొత్తగా చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను వచ్చే మార్చిలో  ప్రజలకు అంకితం చేయబోతున్నామన్నారు. 

రాష్ట్ర ఏర్పాటుకు ముందు రైల్వే బడ్జెట్ లో తెలంగాణకు రూ.251 కోట్లు కేటాయిస్తే ఈరోజు అది రూ.ఆరు వేల కోట్లకు చేరడం ప్రధాని మోదీ ఘనతేనని అన్నారు. రాష్ట్రంలో ట్రిపుల్​ ఆర్​కు కేంద్రం రూ.26 వేల కోట్లు కేటాయిస్తే గత బీఆర్ఎస్​ప్రభుత్వం భూసేకరణ కూడా చేయకపోవడం వల్ల ఆలస్యం జరిగిందన్నారు. భూసేకరణ జరిపితే ట్రిపుల్​ఆర్​ త్వరగా పూర్తి చేయడంతో పాటు చుట్టూ రైల్వే లైన్​ సైతం ఏర్పాటు చేస్తామన్నారు. దీనివల్ల పది జిల్లాలకు కనెక్టివిటీ పెరుగుతుందన్నారు. కొమురవెల్లిలో మల్లన్న సంస్కృతిని తెలిపే విధంగా స్టేషన్ ను నిర్మిస్తామన్నారు. మధ్య ప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ మాట్లాడుతూ దేశాన్నంతటిని ఒకే తాటిపై నిలిపేది రైళ్లేనని, కొమురవెల్లికి గతంలోనే రైలు రావాల్సుండేదని అభిప్రాయపడ్డారు.  

అంతకుముందు కొమురవెల్లి మల్లిఖార్జున స్వామికి మంత్రి కిషన్ రెడ్డి, మధ్యప్రదేశ్​ సీఎం మోహన్ యాదవ్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్​ పట్నం మొక్కులు సమర్పించుకున్నారు. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ , మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్, డివిజన్ మేనేజర్ లోకేష్ మిశ్రా,  జిల్లా అడిషనల్​కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఆలయ అభివృద్ది కి రూ. 100 కోట్లు మంజూరు చేయాలని ఆలయ  పాలక మండలి చైర్మన్ పి.లక్ష్మారెడ్డి వినతి పత్రం సమర్పించారు.