వందేభారత్ రైళ్లు.. త్వరలో విదేశాల్లో కూడా పరుగులు పెడతాయ్

వందేభారత్ రైళ్లు.. త్వరలో విదేశాల్లో కూడా పరుగులు పెడతాయ్

వందేభారత్ రైళ్లు.. ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా పరుగులు పెడుతున్నాయి. వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రయాణికులు ఎంతగానో ఇష్టపడుతున్నారు. వేగానికి వేగం, అద్భుతమైన సౌకర్యాలతో కూడిన ఈ రైలును ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా  ప్రారంభించింది. ప్రస్తుతం భారత్ లో 82 వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు పట్టాలపై పరుగులు పెడుతున్నాయి. అయితే ఈ హైస్పీడ్ రైలును ఎగుమతి చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్వనిి వైష్ణవ్ వెల్లడించారు. 

వందేభారత్  ఎక్స్ ప్రెస్ కొనుగోలు గురించి చాలా దేశాలు ఆరా తీశాయని, రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే భారత దేశం ఈ అద్భుతమైన హైస్పీడ్ వందే భారత్ రైలు ఎగుమతి చేయడం ప్రారంభిస్తుందని అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. వందే భారత్ రైలు భాగాలను స్వదేశీ డిజైన్, సామర్థ్యంతో తయారు చేసేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల యూనిట్లతో పాటు రైల్వే మంత్రిత్వ శాఖ సొంత వర్క్ షాపులను ప్రారంభించింది. దేశీయ ఇంజనీర్లతో వందేభారత్ రైలును నిర్మించడం పెద్ద సవాలే అయినప్పటికీ దానిన అధిగమించాం.. రానున్న కొద్ది సంవత్సరాల్లో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను భారత్ ఇతర దేశాలకు ఎగుమతి చేయగలదని అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. 

మరోవైపు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలో కొత్త రైల్వే ట్రాక్ లనిర్మాణం ఊపందుకుందని అశ్వినీ వైష్ణవ్ అన్నారు. 2004 నుంచి 2014 వరకు రోజుకు సగటున నాలుగు కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్ ను నిర్మించారు.. ఇప్పుడు ప్రతి రోజు 15 కిలోమీటర్లు మేర ట్రాక్ లను వేస్తున్నామన్నారు. గత పదేళ్లలో 41 వేల కిలోమీటర్లు రైల్వే నెట్ వర్క్ ను విద్యుదీకరించామన్నారు. 2004 నుంచి 2014 వరకు రైల్వేలో పెట్టుబడులు రూ. 15వేల 674 కోట్లు కాగా.. 2024-25 ఆర్థిక సంవత్సరానికి కాపెక్స్ రూ. 2లక్షల 52వేల కోట్లు అని అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు.