ప్రైవేటుకు ట్రాక్… మరో 150 రైళ్లు అప్పగించాలని నిర్ణయం

ప్రైవేటుకు  ట్రాక్… మరో 150 రైళ్లు అప్పగించాలని నిర్ణయం

పెద్ద సంఖ్యలో రైల్వే స్టేషన్ల మెయింటెనెన్స్​ కూడా..

దేశవ్యాప్తంగా 550 స్టేషన్లలో వైఫై సౌకర్యం

టూరిస్టు ప్రాంతాలకు తేజస్​ రైళ్లను నడిపే యోచన

పంట కోల్డ్​ స్టోరేజీతో కృషి రైలు అందుబాటులోకి..

రైల్వేలో ప్రైవేటుకు ట్రాక్​ పడుతోంది. ఇప్పటికే కొన్ని రైల్వే స్టేషన్లను, మూడు రైళ్ల నిర్వహణను ప్రైవేటుకు అప్పగించగా.. వచ్చే ఫైనాన్షియల్​ ఇయర్​లో పెద్ద సంఖ్యలో రైల్వే స్టేషన్లను, 150కిపైగా రైళ్లను ప్రైవేటు నిర్వహణకు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ బడ్జెట్​లో ప్రతిపాదనలు చేశారు. మొత్తంగా రైల్వేల వ్యయాన్ని రూ.2.54 లక్షల కోట్లుగా పేర్కొన్నారు. ఇందులో క్యాపిటల్​ఎక్స్​పెండిచర్​ కింద రూ.లక్షా 61 వేల కోట్లు చూపారు. జీతాలు, పెన్షన్లు, ఇతర ఖర్చులు ఉండే రెవెన్యూ వ్యయం రూ.92,993 కోట్లు అవుతుందని అంచనా వేశారు. రైల్వేల సొంత ఆదాయానికి తోడు కేంద్ర బడ్జెట్​ నుంచి రూ. 70 వేల కోట్లను అదనంగా కేటాయిస్తున్నట్టు తెలిపారు. రైల్వే క్యాపిటల్​ వ్యయం​గత బడ్జెట్​లో రూ.లక్షా 56 వేల కోట్లుకాగా.. ఈసారి మూడు శాతం పెరిగింది. రెవెన్యూ వ్యయం కూడా సుమారు ఎనిమిది శాతం పెరిగింది.

మరిన్ని తేజస్​ రైళ్లు

వేగంగా ప్రయాణించే తేజస్​ రైళ్లను దేశవ్యాప్తంగా మరిన్ని రూట్లలో నడపాలని నిర్ణయించారు. ముఖ్యంగా టూరిస్టు ప్రాంతాలను కలిపే రూట్లకు ప్రాధాన్యత ఇస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి వెల్లడించారు. డిజిటల్​ ఇండియా స్కీమ్​లో భాగంగా దేశవ్యాప్తంగా మరో 550 రైల్వే స్టేషన్లలో వైఫై సౌకర్యం కల్పించనున్నట్టు తెలిపారు. ముంబై, అహ్మదాబాద్​ మధ్య హైస్పీడ్​ ట్రెయిన్​ నడిపిస్తామన్నారు. మరిన్ని రైల్వే స్టేషన్ల పునరుద్ధరణ, 150 రైళ్ల నిర్వహణను ప్రైవేటుకు అప్పగిస్తామని ప్రకటించారు. రైతులకు ప్రయోజనం కలిగించేలా కృషి  రైలును అందుబాటులోకి తెస్తామని ఫైనాన్స్​ మినిస్టర్​ ప్రకటించారు. పంటలు, ఇతర ఉత్పత్తులు ఎండ, వేడికి దెబ్బతినకుండా ఆ రైలులో కోల్డ్​ ట్రాన్స్​పోర్టు సదుపాయం కూడా ఉంటుందని తెలిపారు. ‘పబ్లిక్, ప్రైవేట్​పార్టనర్​షిప్​(పీపీపీ)’ విధానంలో ఈ రైళ్లను నడుపుతామని, దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల మధ్య కోల్డ్​ సప్లై చైన్​ ఏర్పాటవుతుందని చెప్పారు.

మూడో ప్రైవేటు రైలు..

ఐఆర్​సీటీసీ ఆధ్వర్యంలో మరో ప్రైవేటు రైలుకు గ్రీన్​సిగ్నల్​ పడింది. మధ్యప్రదేశ్​లోని ఇండోర్​ నుంచి యూపీలోని వారణాసి మధ్య ప్రైవేటు ట్రెయిన్​ నడపనున్నట్టు రైల్వో బోర్డు చైర్మన్​ వినోద్​కుమార్​ యాదవ్​ శనివారం ప్రకటించారు. ఇప్పటికే ఢిల్లీ–లక్నో, అహ్మదాబాద్–ముంబై మధ్య రెండు ప్రైవేటు రైళ్లు నడుస్తున్నాయి. ఈ నెల 20వ తేదీ నుంచి మూడో ప్రైవేటు రైలు ప్రారంభమవుతోంది.

మరిన్ని వెలుగు వార్తలు కోసం క్లిక్ చేయండి