మూడు రోజుల వరకు వర్ష సూచన

మూడు రోజుల వరకు వర్ష సూచన

హైదరాబాద్: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల వరకు ఓ మోస్తరు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. తెలంగాణ తోపాటు.. విదర్భ ప్రాంతాలలో 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల చెదురుమదురు వర్షాలతోపాటు.. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే తూర్పు-పశ్చిమ కనుమల వెంబడి భారతదేశం మీదుగా 3.1 కిలోమీటర్ల ఎత్తు నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్య  ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకి వెళ్లేకొద్దీ దక్షిణ దిశ వైపుకు వంపు తిరిగి ఉన్నది. దీని ప్రభావంతో ఉత్తర ఆంధ్రప్రదేశ్ తోపాటు దక్షిణ ఒరిస్సా తీరాలకు దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 1.5 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈశాన్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలో ఈనెల 20 న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఆవర్తనాల ప్రభావంతో ఈరోజు, రేపు చాలా చోట్ల అలాగే ఎల్లుండి అనేక చోట్ల అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కోమురంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్నసిరిసిల్ల, కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్-పట్టణ, వరంగల్-గ్రామీణ, మెహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో ఇవాళ రేపు  ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ ప్రకటించింది.