
సోమవారం (సెప్టెంబర్ 22) సాయంత్రం మొదలైన వర్షం ఎప్పటికీ తగ్గకపోవడంతో హైదరాబాద్ నగర వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సాయంత్రం క్లౌడ్ బరస్ట్ అయ్యిందా అన్నట్లు కురిసిన వానకు నగరంలో రోడ్లన్నీ వాగులు, చెరువులను తలపించాయి. దీంతో భారీ ట్రాఫిక్ జాంతో నగరజీవి వర్షంలో తడుచుకుంటూనే ఇళ్లకు చేరుకున్న పరిస్థతి. కొన్ని ఏరియాల్లో రోడ్లపై భారీగా వరద ప్రవహిస్తుండటంతో బైకులు కొట్టుకుపోయాయి. దీంతో దాటలేక చాలా సేపు రోడ్లపైనే ఉండాల్సి వచ్చింది.
సాయంత్రం నుంచి దాదాపు మూడు నాలుగు గంటలు నాన్ స్టాప్ గా కురిసింది.. ఇక తగ్గుతుందిలే అనుకునే వాళ్లకు వర్షం హెచ్చరిస్తూనే ఉంది. ఇవాళ రెస్ట్ లేదు అన్నట్లుగా కురుస్తూనే ఉంది. కాసేపు గ్యాప్ ఇచ్చినట్లుగా చిరు జల్లులు కురిసినట్లు అనిపించిన వాన.. ఉన్నట్లుండి మళ్లీ ఊపందుకుటోంది.
లేటెస్ట్ గా సోమవారం రాత్రి 11 గంటల తర్వాత మరోసారి వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం తెలిపింది. గ్రేటర్ పరిధిలో పఠాన్ చెరు, శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, అల్వాల్, సికింద్రాబాద్. ఖైరతాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ, హకింపేట్, కంటోన్ మెంట్, కాప్రా మొదలైన ఏరియాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. రానున్న మరికొన్ని గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది.