
కొలంబోలో భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న నామమాత్రపు మూడో వన్డేకు వర్షం అంతరాయం కలిగించింది. 23 ఓవర్ల దగ్గర వర్షం కురవడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. అంతకుముందే నెమ్మదిగా ప్రారంభమైన వర్షం క్రమంగా పెరగడంతో మ్యాచ్ ను నిలిపేశారు. ప్రస్తుతం వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. దీంతో.. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి భారత్ 3 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. క్రీజులో మనీశ్ పాండే (10), సూర్యకుమార్ యాదవ్ (22) ఉన్నారు. అంతకుముందు ఓపెనర్ పృథ్వీషా 49 పరుగుల దగ్గర వికెట్ కోల్పోయాడు. షనక వేసిన బౌలింగ్‌లో LBW పెవిలియన్ చేరాడు. దీంతో ఒక్క పరుగు తేడాతో ఆఫ్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఇక కెప్టెన్ శిఖర్ ధావన్ ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. కేవలం 13 పరుగులు మాత్రమే చేశాడు. చమీరా వేసిన బౌలింగ్‌లో భానుక చేతికి చిక్కాడు. తొలి మ్యాచ్ ఆడుతున్న సంజూ శాంసన్ 46 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర జయవిక్రమ బౌలింగ్‌లో షాట్ ఆడబోయి అవిష్క ఫెర్నాండో చేతికి చిక్కి పెవిలియన్ బాటపట్టాడు. శ్రీలంక బౌలర్లలో దుష్మంత చమీరా, ప్రవీణ్ జయవిక్రమ, దసున్ షనక తలా వికెట్ తీసుకున్నారు.