సౌత్ కొరియాను ముంచెత్తిన భారీ వర్షాలు

సౌత్ కొరియాను ముంచెత్తిన భారీ వర్షాలు

సౌత్ కొరియాను వర్షాలు ముంచెత్తుతున్నాయి. సౌత్ కొరియా రాజధాని సియోల్ లో కుంభవృష్టి కురిసింది. రహదారులన్నీ నదుల్లా మారాయి. సబ్ వే స్టేషన్లు జలదిగ్బంధమయ్యాయి. వరదల్లో 9 మందికిపైగా చనిపోగా.. మరో 14 మంది గాయపడ్డారు. ఆరుగురు గల్లంతయ్యారు. భారీగా రోడ్లపై వరద నీరు రావడంతో చాలా చోట్ల కార్లు నీటమునిగాయి. 800 భవనాలు దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల గత 80 ఏళ్లల్లో ఎన్నడూ లేనంత వర్షపాతం నమోదైనట్లు అక్కడి వాతావరణ శాఖ తెలిపింది.

సౌత్ కొరియాలో మరికొన్ని రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. వీధుల్లో భారీగా వరద చేరుతుండటంతో సహాయకచర్యలకు ఆటంకం కలుగుతోంది. సియోల్ పరిధిలోని ఇంచియాన్, గ్యాంగీల్లో గంటకు 10 సెంటీమీటర్ల చొప్పున వర్షం పడింది. సియోల్ లోని డాంగ్జాక్ జిల్లాలో గంటకు 14.1 సెంటీమీటర్ల చొప్పున వర్షం పడింది. 1942 నుంచి ఇదే అత్యధికం. సియోల్ లో భారీ వర్షపాతానికి రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. రైల్వే సేవలు పూర్తిగా నిలిచిపోయాయి.