హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వారం రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. శనివారం (సెప్టెంబర్ 19) ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దాని ప్రభావంతో హైదరాబాద్‌సహా రాష్ట్రమంతా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది.
రాష్ట్రానికి ఎల్లో అలర్ట్జారీ చేసింది. కాగా, రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఒక్కోసారి ఒక్కోలా ఉంటున్నాయి. వర్షాలు లేక రాష్ట్రవ్యాప్తంగా ఎండలు పెరిగిపోతున్నాయి. పొద్దునంతా ఎండమంట, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అల్పపీడన ప్రభావంతో రాత్రి కాగానే పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో అల్పపీడన ప్రభావం కనిపిస్తున్నది.
గురువారం రాత్రి నుంచి మెదక్, సిద్దిపేట, వనపర్తి, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం పడింది. మెదక్జిల్లాలో 12 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నిజామాబాద్, మంచిర్యాల్, జగిత్యాల్, జనగామ జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు పడ్డాయి. శుక్రవారం కూడా రాష్ట్రంలోని పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడలో అత్యధికంగా 7.4 సెంటీమీటర్ల వర్షం పడింది.
యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో 6.8 సెంటీమీటర్లు, రంగారెడ్డి జిల్లా దండుమైలారంలో 6, యాదాద్రి జిల్లా దత్తప్పగూడలో 5, మహబూబ్‌నగర్ జిల్లా మాచనపల్లిలో 4 సెంటీమీటర్లు, రంగారెడ్డి జిల్లా యాచారంలో 3.4, వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్‌లో 3.4 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
