రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం.. మరో 4 రోజుల పాటు వానలు

రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం.. మరో 4 రోజుల పాటు వానలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఈ నెలలో వడగాడ్పులు తీవ్రం అయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణ సహా పలు దక్షిణాది రాష్ట్రాల్లో టెంపరేచర్లు విపరీతంగా పెరిగే అవకాశముందని, ఫలితంగా హీట్​వేవ్స్ ఎక్కువయ్యే ముప్పు ఉంటుందని హెచ్చరించింది.

అయితే, ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం ఈ నెలలో టెంపరేచర్లు తగ్గి, కాస్త కూల్ గానే ఉంటుందని తెలిపింది. హిందూ మహాసముద్రంలో డైపోల్ (ఇండియన్ ఎల్ నినో) పరిస్థితి కారణంగానే ఇలా దక్షిణాదిలో ఎక్కువ వేడి, ఉత్తరాదిలో చల్లటి వాతావరణం నెలకొంటుందని పేర్కొంది. ఇక రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం నమోదైంది. కరీంనగర్​లో అత్యధికంగా 8.2 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది.

దుర్షేడ్​లో 7.4, సిద్దిపేట జిల్లా పెద్దకోడూరులో 5, కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో 5, కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేటలో 4.7, హనుమకొండ జిల్లా చింతగట్టులో 4.6, జనగామ జిల్లా లింగాలఘణపూర్​లో 4.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లోనూ వానలు పడ్డాయి.