మరో నాలుగు రోజులు తుఫాన్ వానలు .. హెచ్చరించిన వాతావరణ శాఖ

 మరో నాలుగు రోజులు తుఫాన్ వానలు .. హెచ్చరించిన వాతావరణ శాఖ
  • ముంచుకొస్తున్న  మోచా తుఫాన్
  • 7న బంగాళాఖాతంలో అల్పపీడనం
  • మరో నాలుగు రోజులు వానలు
  • హెచ్చరించిన వాతావరణ శాఖ
  • కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లోనే  వడ్లు.. ఆందోళనలో రైతులు
  • 7న బంగాళాఖాతంలో అల్పపీడనం
  • మరో నాలుగు రోజులు వానలు
  • హెచ్చరించిన వాతావరణ శాఖ అధికారులు.

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కురుస్తున్న చెడగొట్టు వానలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తాజాగా రైతన్నకు ‘మోచా’ తుఫాను రూపంలో మరో ముప్పు పొంచి ఉంది. ఈమేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పిన వాతావరణ శాఖ.. మరో 3 రోజుల్లో అల్పపీడనం ఏర్పడే అవ కాశం ఉందని హెచ్చరించింది. 6వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడుతుందని పేర్కొంది. అది బలపడి 7న అల్పపీడనంగా మారుతుందని, 8న మరింత బలపడి తీవ్ర అల్ప పీడనంగా మారుతుందని హెచ్చరించింది. మరుసటి రోజు అది తీవ్రమై తుఫానుగా మారే చాన్స్ ఉందని తెలిపింది.

రాష్ట్రవ్యాప్తంగా వానలు

రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. బుధవారం కొన్ని చోట్ల భారీ వర్షాలు పడ్డాయి. మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిశాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నాగుపల్లిలో 5.5 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. నిజామాబాద్ జిల్లా బెల్లాల్, కొత్తగూడెం జిల్లా పెంట్లంలో 4.1 సెంటీ మీటర్లు, మణుగూరులో 3.4 సెం.మీ, ములుగు జిల్లా వెంకటాపురంలో 2.9 సెం.మీ, జోగుళాంబ గద్వాల జిల్లా మల్లాపురంలో 2.3 సెం.మీ, నారాయణపేటలో 2.1 సెం.మీ, మోస్రాలో 2 సెం.మీటర్ల వర్షపాతం రికార్డయ్యింది. మరో నాలుగు రోజులు వానలు పడ్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. గంటకు 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.

అసలు లోటే లేదు

రాష్ట్రంలో పోయిన వానాకాలం 2022, జూన్ 1 నుంచి 2023, మే 3 దాకా రాష్ట్రంలో ఎక్కడా లోటు వర్షపాతం నమోదు కాలేదు. సాధారణం కంటే అధిక వర్షపాతమే రికార్డయ్యింది. 17 జిల్లాల్లో సాధారణం కన్నా అధికం, 15 జిల్లాల్లో సాధారణం కన్నా అత్యధిక వర్షపాతం నమోదైంది. కేవలం ఖమ్మం జిల్లాలోనే సాధారణ వర్షపాతం రికార్డ్ అయింది. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 879.6 మిల్లీ మీటర్లు కాగా.. అంతకుమించి 1,357 మిల్లీ మీటర్ల వర్షం పడింది. అది సాధారణం కన్నా 54% అధిక వర్షపాతం. అదే జూన్ నుంచి సెప్టెంబర్ దాకా వర్షాకాలంలో పడిన వాన 1,098 మిల్లీ మీటర్లు. కాగా, హైదరాబాద్​లో వర్షాకాలంలో 742 మిల్లీ మీటర్ల వర్షం కురవగా.. మొత్తంగా 1,081 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తంగా ఇప్పటిదాకా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అత్యధికంగా 1,914.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

సాధారణం కంటే ఎక్కువ నమోదైన జిల్లాలు

ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొం డ, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, వికారాబాద్, నాగర్​కర్నూల్, నల్గొండ, సూర్యాపేట.

భారీ వర్షపాతం నమోదైన జిల్లాలు

ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, కరీంనగర్, సిద్దిపేట, జనగామ, మేడ్చల్, రంగారెడ్డి, మహబూబ్​నగర్​, జోగుళాంబ గద్వాల, వనపర్తి, ములుగు, నారాయణపేట.