
రాజ్ తరుణ్ హీరోగా మరో కొత్త చిత్రం ప్రారంభమైంది. రమేష్ కడుముల దర్శకత్వంలో మురళీధర్ రెడ్డి, కేఐటిఎన్ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. రాశి సింగ్ హీరోయిన్. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నాడు. శుక్రవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. దర్శకులు మారుతి క్లాప్ కొట్టగా, ప్రవీణ్ సత్తారు కెమెరా స్విచాన్ చేశారు. త్రినాథరావు నక్కిన గౌరవ దర్శకత్వం వహించాడు. నిర్మాతలు వివేక్ కూచిభొట్ల, ధీరజ్ మొగిలినేని, ఎస్‌కేఎన్, వంశీ అతిథులుగా హాజరై మూవీ టీమ్‌కు ఆల్ ద బెస్ట్ చెప్పారు.
ఈ సందర్భంగా రాజ్ తరుణ్ మాట్లాడుతూ ‘ఇదొక క్రైమ్ కామెడీ జానర్. ఇలాంటి కథలంటే నాకు చాలా ఇష్టం. ఏప్రిల్ 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం’ అని చెప్పాడు. దర్శకుడు రమేష్ మాట్లాడుతూ ‘కథ చాలా బాగా వచ్చింది. స్వామి రారా, అంధాధూన్ తరహాలో ఉంటుంది. శరవేగంగా షూటింగ్ జరిపి అక్టోబర్‌లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాం’ అని చెప్పాడు. మరోవైపు రాజ్ తరుణ్ హీరోగా జె శివసాయి వర్ధన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘భలే ఉన్నాడే’ చిత్రం నుంచి శుక్రవారం ఓ పాటను విడుదల చేశారు. ‘ఆడోళ్లకు ఆమడ దూరం.. చేసేది చీరల బేరం.. తెల్లారితే సూది దారం.. యవ్వారం యమునా తీరం..’ అంటూ సాగే ఈ పాటను శేఖర్ చంద్ర కంపోజ్ చేయగా, పూర్ణాచారి క్యాచీ లిరిక్స్ రాశాడు. ధనుంజయ్ సీపాన పాడాడు. ఎన్వీ కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.